ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో ఊహించని ఘటన జరిగింది. ఆక్షనీర్ ఎడ్మెడేస్ కళ్లు తిరిగిపడిపోయాడు.. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వేలాన్ని నిలిపివేశారు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ ఎడ్మెడేస్ ఆరోగ్యంపై స్పందించింది. ‘‘ఆక్షనీర్ ఎడ్మెడేస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. తిరిగి వేలంలో పాల్గొంటారు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. లో బీపీ కారణంగానే ఆయన స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. 2019 నుండీ ఎడ్మెడేస్ ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. అంతకుముందు రిచర్డ్ హ్యాడ్లే ఐపీఎల్ వేలం నిర్వహించారు.
ఇదిలాఉంటే.. వేలంలో ఫ్రాంచైజీలు నెమ్మదిగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. రూ.50 కోట్ల పర్స్ మనీ ఉన్నఆర్సీబీ మాత్రం జోరుగానే ఆటగాళ్లను కొనుగోలు చేస్తోంది. గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది.. అలాగే యువ బౌలర్ హర్షల్ పటేల్‌ను ఏకంగా రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది వేలంలో రూ.10 కోట్లకుపైగా ధర పలికిన తొలి బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.