Site icon HashtagU Telugu

IPL : పంత్ కోలుకోవడానికి కనీసం 6 నెలలు. ఐపీఎల్ ఢిల్లీ కెప్టెన్ గా అతని స్థానంలోకి

Pant Replaced Him As Captain Of Ipl Delhi

Pant Replaced Him As Captain Of Ipl Delhi

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. పంత్ పూర్తి స్థాయిలో కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి కనీసం 6 నెలలు పడుతుందని సమాచారం. దీంతో వచ్చే ఐపీఎల్ (IPL) సీజన్ నుంచి పంత్ తప్పుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ స్థానంలో మరొకరి కోసం ఆ ఫ్రాంచైజీ వెతుకుతోంది. అయితే రేసులో కొందరి పేర్లు వినిపిస్తున్నా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ముందున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్‌కు మంచి అనుభవం ఉంది. సన్ రైజర్స్ 2016 సీజన్ టైటిల్‌ను వార్నర్ కెప్టెన్సీ లోనే గెలిచింది. అనుభవంతో పాటు జట్టును నడిపించగల సామర్థ్యం వార్నర్‌కే ఉందని ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఒకవేళ విదేశీ ప్లేయర్ కాకుండా.. భారత ఆటగాడినే కెప్టెన్‌గా ఎంపిక చేయాలనుకుంటే మాత్రం పృథ్వీ షా ముందువరసలో ఉన్నాడు. ఐపీఎల్‌ (IPL) లో కెప్టెన్సీ అనుభవం లేకున్నా.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఉండడం కలిసొచ్చే అంశం. పృథ్వి షా సారథ్యంలోనే ముంబై విజయ్ హజారే ట్రోఫీ గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో మనీశ్ పాండే‌ కూడా ఉన్నాడు. కర్ణాటక కెప్టెన్‌గా పాండేకు అనుభవం ఉంది. పాండే సారథ్యంలో కర్ణాటక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. గతంలో డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో పాండే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టును కూడా నడిపించాడు. ఇక ఆస్ట్రేలియా స్నియార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ కూడా పోటీలో ఉన్నాడు. ఓవరాల్ గా ఈ నలుగురిలో వార్నర్ వైపే ఢిల్లీ మేనేజ్ మెంట్ మొగ్గు చూపుతోంది. కోచ్ పాంటింగ్ కు వార్నర్ సత్తా ఏంటనేది తెలుసు…దీంతో అతనికే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. దీనికి తోడు గత యేడాది కాలంగా వార్నర్ బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు.

Also Read:  Royal Enfield Bullet : రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ రూ.18,700 మాత్రమే..