ఆసియాకప్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన హాంకాంగ్‌తో తలపడబోతోంది. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ వేటను ఘనంగా ఆరంభించింది . గతేడాది టీ20 వరల్డ్ కప్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. చిరకాల ప్రత్యర్థిపై అద్బుత ప్రదర్శన చేసింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గెలిచి సూపర్-4లోకి దూసుకెళ్లాలని రోహిత్ సేన భావిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని పేస్ దళం అదిరిపోయే ప్రదర్శన చేసింది. భువి నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరోపక్క హార్దిక్ పాండ్య అటు బౌలింగ్‌తో ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు.
దీంతో మరోసారి వీరిద్దరూ చక్కటి ప్రదర్శన చేయాలని జట్టు భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో లక్ష్యం 148 చిన్నదే అయినప్పటికీ.. ఛేదించడానికి చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. ముఖ్యంగా టాపార్డర్ విఫలమైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాపార్డర్ ఆటగాళ్లు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోహ్లీ పూర్తి ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కూడా సత్తా చాటాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. అటు బంతితోనూ హార్దిక్, జడేజా ఆకట్టుకున్నారు. మరోవైపు హాంకాంగ్‌ను తేలిగ్గా తీసుకునేందుకు వీలులేదు.
చివరి సారిగా భారత్.. ఈ జట్టుతో 2018 ఆసియా కప్‌లోనే తలపడింది. ఇప్పుడు షార్ట్ ఫార్మేట్ కావడంతో గట్టిపోటీ ఇచ్చేందుకు హాంకాంగ్ రెడీ అయింది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సూపర్ 4 చేరుకుంటుంది.