Asia Cup: ఆసియా కప్ 2025 (Asia Cup)లో పాకిస్థాన్ సూపర్-4కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా 10వ మ్యాచ్‌లో యూఏఈని ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ ఓటమితో ఆసియా కప్ 2025 నుంచి యూఏఈ జట్టు నిష్క్రమించింది. ఇప్పుడు ఆసియా కప్ 2025లో మరోసారి భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది. అంతకుముందు లీగ్ మ్యాచ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఫైట్ ఈరోజు
ఆసియా కప్ 2025లో అభిమానులకు రెండోసారి భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరాటం చూడబోతున్నారు. సూపర్-4లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇదే స్టేడియంలో టీమిండియా ఇంతకుముందు పాకిస్థాన్‌ను ఓడించింది. టీమిండియా ఇప్పటికే తమ రెండు మ్యాచ్‌లలో గెలిచి సూపర్-4కు అర్హత సాధించింది. టీమిండియా తమ మూడో మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో ఆడనుంది.
Also Read: Heavy Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ!
యూఏఈని ఓడించి క్వాలిఫై అయిన పాకిస్థాన్
యూఏఈతో జరిగిన మ్యాచ్ పాకిస్థాన్‌కు చావో-రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు ఓడిపోతే సూపర్-4 రేసు నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. కానీ అలా జరగలేదు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరపున ఫఖర్ జమాన్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, షాహీన్ అఫ్రిది 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యూఏఈ తరపున జునైద్ సిద్ధిఖీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను 41 పరుగుల తేడాతో గెలుచుకుంది. పాకిస్థాన్ తరపున బౌలింగ్ చేసిన షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు.