Asia Cup 2025: భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఆసియా కప్ (Asia Cup 2025) టీమ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాను ఎంపిక చేయడం సెలెక్టర్లకు సవాలుగా మారింది. ఎందుకంటే 15 మందిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉండగా.. టీ20 ఫార్మాట్‌లో ఆడేందుకు అనేక మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత శుభ్‌మన్ గిల్ పేరు బాగా చర్చనీయాంశమైంది. గిల్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ కాంబినేషన్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది సంజు శాంసన్‌కు సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
గిల్ కారణంగా సంజు స్థానం మారవచ్చు
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్‌గా రాణించడమే కాకుండా ఈ సిరీస్‌లో అద్భుతమైన బ్యాటింగ్ కూడా కనబరిచాడు. ఈ సిరీస్‌లో గిల్ 754 పరుగులు చేసి అత్యధిక రన్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీనితో ఆసియా కప్ జట్టులో అతన్ని చేర్చాలనే డిమాండ్ పెరిగింది.
Also Read: Gold : ఒడిశాలో భారీ బంగారు నిక్షేపాలు..జీఎస్ఐ కీలక ప్రకటన
కొన్ని నివేదికల ప్రకారం.. ఆసియా కప్‌లో గిల్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే సంజు శాంసన్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు పలు సిరీస్‌లలో సంజు ఓపెనర్‌గా ఆడాడు. ఈ పరిస్థితిలో సంజును జట్టు నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆకాష్ చోప్రా వ్యాఖ్యలు
ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. “శుభ్‌మన్ గిల్ మూడవ ఓపెనర్ అయితే, మీరు అతన్ని బెంచ్‌పై కూర్చోబెట్టడానికి ఇష్టపడతారా? ఒకవేళ మీరు అలా చేయకుండా తుది జట్టులో అతన్ని ఆడించాలనుకుంటే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారు? ఒకవేళ ఆ ఆటగాడి పేరు సంజు శాంసన్ అయితే, వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? ఇదే ప్రధాన సమస్య. మధ్య క్రమంలో సంజు శాంసన్‌ను మీరు చూడలేరు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మూడవ, నాలుగో స్థానాల్లో ఆడతారు. సంజు ఐదవ స్థానంలో ఆడతాడా? ఇది అంత మంచి విషయం కాదు.” అని వ్యాఖ్యానించారు.