Asia Cup 2025: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2025 ఆసియా కప్ (Asia Cup 2025) నుంచి మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని కోరింది. అయితే, ఐసీసీ ఈ అభ్యర్థనను అధికారికంగా తిరస్కరించింది. తమ డిమాండ్ నెరవేర్చకపోతే టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని పాకిస్థాన్ బోర్డు ఐసీసీని హెచ్చరించింది.
సెప్టెంబర్ 14 ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాతో కరచాలనం చేయలేదు. టీమ్ షీట్ కూడా మార్చుకోలేదు. మ్యాచ్ సమయంలో కూడా భారత ఆటగాళ్లు వారితో ఎలాంటి సంభాషణలు జరపలేదు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ షాట్ కొట్టగానే నేరుగా శివమ్ దూబేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు.
ఆండీ పైక్రాఫ్ట్‌నే నిందిస్తున్న పాకిస్థాన్
మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు కరచాలనం కోసం వేచి చూసినా.. భారత ఆటగాళ్లు వారితో కలవకుండానే డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసుకున్నారు. మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎందుకు జరుగుతోందని సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని, వారితో కలవవద్దని ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నారు. మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది తమ జట్టు మొత్తం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని ఎందుకు పాటించలేదని అడిగిన ప్రశ్నకు “కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తి కంటే ముఖ్యమైనవి” అని ఆయన అన్నారు.
Also Read: Illegal Relationship : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త చెవులు కోసేసిన భార్య
ఈ అవమానానికి మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్టే కారణమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నక్వీ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో “మ్యాచ్ రెఫరీ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌ను ఉల్లంఘించారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది” అని పోస్ట్ చేశారు.
ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ వైదొలుగుతుందా?
ఏ నిబంధన ప్రకారం పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి బయటపడదు. కానీ మ్యాచ్ రెఫరీని తొలగించకపోతే టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని పీసీబీ బెదిరించింది. పాకిస్థాన్‌కు తర్వాతి మ్యాచ్ సెప్టెంబర్ 17న యూఏఈతో ఉంది. ఐసీసీ తన డిమాండ్‌ను తిరస్కరించిన తర్వాత పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ పాకిస్థాన్ వైదొలిగితే, భారత్‌తో పాటు యూఏఈ జట్టు సూపర్-4కు అర్హత సాధిస్తుంది.