Site icon HashtagU Telugu

Asia Cup 2023: పాక్ లో నాలుగు, మిగిలినవి శ్రీలంకలో… ఆసియా కప్ వేదికలు ఖరారు

Asia Cup 2023

New Web Story Copy (77)

Asia Cup 2023: ఆసియా కప్ వేదికపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. పాక్ ఆతిథ్య హక్కులు కొనసాగిస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ వచ్చే ఆసియా కప్ వేదికలను ఖరారు చేసింది. పాకిస్థాన్ లో నాలుగు మ్యాచ్ లు జరగనుండగా…మిగిలిన మ్యాచ్ లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. పాక్ లోనే ఆసియా కప్ జరగాల్సి ఉండగా…భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ఎంపిక చేసింది.ఆతిథ్య హక్కులు మాత్రం పాక్ తోనే ఉండగా…భారత్ మ్యాచ్ లతో పాటు మరికొన్ని శ్రీలంకలో జరగనున్నాయి. మొత్తం 13 మ్యాచుల ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించబోతున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. నాలుగు మ్యాచులు పాకిస్తాన్‌లో జరుగబోతుంటే, మిగిలిన మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరుగుతాయి. ఆసియా కప్ 2023 ఎడిషన్‌లో మూడేసి జట్లు రెండు గ్రూప్‌లుగా మొదటి రౌండ్ మ్యాచులు ఆడతాయి. ఆ తర్వాత సూపర్ 4 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

నిజానికి మొదట యూఏఈని తటస్థ వేదికగా పాకిస్థాన్ ప్రతిపాదించింది. అయితే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఆ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. శ్రీలంక కూడా ఇదే కారణంతో యూఏఈలో ఆడటానికి మొగ్గు చూపలేదు. అయితే, అప్పటినుంచి వేదికగా శ్రీలంక పేరు వినిపించింది. ఈ వేదికకు పాక్​ ఒప్పుకోక పోతే.. ఆ దేశం లేకుండా టోర్నీ జరుగుతుందని.. వార్తలు వచ్చాయి. ఒకదశలో ఆసియా కప్‌ నిర్వహణపై పాకిస్థాన్ పట్టు విడవకపోతే..టోర్నీ రద్దు చేసేందుకు ఏసీసీ బోర్డు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. గతేడాది ఆసియా కప్‌ టీ20 మెగా టోర్నీలో భారత్‌, పాకిస్థాన్​, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​లతో పాటు హాంగ్‌ కాంగ్‌ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకోగా.. పాకిస్థాన్​ రన్నరప్‌గా నిలిచింది.ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఆసియా కప్ సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు ఆసియా కప్‌లో ఈసారి నేపాల్ కూడా తొలిసారి ఆడబోతోంది.

Read More: Rohit Sharma: టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ఔట్ ?