Asia Cup 2022: భారత్, పాక్ మ్యాచ్ పై గంగూలీ ఏమన్నాడంటే…

ఆసియాకప్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. శ్రీలంకలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ సారి యుఏఈ వేదికగా టోర్నీ జరగబోతోంది.

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 02:13 PM IST

ఆసియాకప్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. శ్రీలంకలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ సారి యుఏఈ వేదికగా టోర్నీ జరగబోతోంది. ఎప్పటిలానే ఈ టోర్నీలో భారత్ , పాకిస్థాన్ పోరు కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరు జరగనుంది. ఇప్పటికే టిక్కెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

గత ప్రపంచకప్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా ఎదురుచూస్తోంది. తాజాగా ఈ మ్యాచ్ పై బీసీసీఐ ప్రెసిడెంట్ , భారత మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను భారత్-పాక్ మ్యాచ్ వలే కాకుండా టోర్నీలో భారత్ విజయం కోసం చూడాలని సూచించాడు. తాను ఆడే రోజుల్లో భారత్-పాక్ అంటే అది మరో మ్యాచ్ మాత్రమేనన్నాడు.. భారత్ మెరుగైన జట్టనీ, ఇటీవల కాలంలో చాలా బాగా రాణిస్తోందన్నాడు. ఆసియా కప్‌లోనూ మన జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశిస్తున్నట్టు గంగూలీ చెప్పుకొచ్చాడు.

కేవలం పాకిస్థాన్ పైనే కాకుండా టోర్నీలో భారత్ విజేతగా నిలవాలని దాదా ఆకాంక్షించాడు. అభిమానులు కూడా భారత్ ఆసియాకప్ గెలవాలని కోరుకోవాలని సూచించాడు. ఇదిలా ఉంటే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే వేదికపై ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. దీంతో ఆ మ్యాచ్‌లో ఎలాగైనా చిరకాల ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలి టీమిండియాతో పాటు అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపైనే స్పందించిన దాదా ప్రతీకారం కోసం కాకుండా విజయం కోసం ఆడాలని పిలుపునిచ్చారు. ఆసియా కప్ తర్వాత టీమిండియా అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. అక్కడ కూడా భారత్-పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఆసియాకప్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు జరగనుండగా.. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది.