Site icon HashtagU Telugu

Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!

R Ashwin Rishabh Pant

R Ashwin Rishabh Pant

టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గువాహటి టెస్టులో అతని నిర్లక్ష్యపు బ్యాటింగ్, కెప్టెన్సీ నిర్ణయాలపై మాజీ స్పిన్నర్ అశ్విన్ కూడా నిరాశ వ్యక్తం చేశాడు. పంత్ దూకుడు ఆటతీరుపై, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలనే దానిపై చర్చ జరుగుతోంది. సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికా జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం కలిపి భారత్‌కు 450 నుంచి 500 టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంది.

టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గువాహటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ కోల్పోయిన పంత్.. కెప్టెన్సీ సమయంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కమ్ బ్యాక్ ఇస్తారనుకుంటే ఫీల్డింగ్ సెట్టింగ్, బాడీ లాంగ్వేజ్ చూసి టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా నిరాశకు గురయ్యాడు.

టీమిండియా అన్ని ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్, ఇప్పుడు క్రికెట్ విశ్లేషకుడిగా మారిపోయాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషణలు చేయడమే కాకుండా, ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. అయితే నాలుగో రోజు మ్యాచ్ మధ్యలో పంత్ బాడీ లాంగ్వేజ్ తనను నిరాశ పరిచిందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

“రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో టీమ్ మళ్లీ పుంజుకుంటుంది అనే ఆశ ఉంది. కానీ మైదానంలో కనిపించిన బాడీ లాంగ్వేజ్ మాత్రం అంత ఆశాజనకంగా లేదు” అంటూ అశ్విన్ హార్ట్ బ్రేక్ సింబల్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

పంత్ మొదటసారి భారత్‌కు టెస్టుల్లో కెప్టెన్సీ చేస్తుండగా, తొలి ఇన్నింగ్స్‌లో అతని నిర్లక్ష్యం కారణంగా భారత బ్యాటింగ్ దారుణంగా విఫలమైంది. జట్టు వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో కూడా రిస్కీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి మార్కో యాన్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కొత్త తరం క్రికెటర్లు ఆగ్రెసివ్ ఆటను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కానీ పరిస్థితి డిమాండ్ చేస్తే పాత తరహా డిఫెన్సివ్ గేమ్ కూడా అవసరమే. ఇది పంత్ కూడా అర్థం చేసుకోవాల్సిన నిజం.

రిస్క్ ఎక్కువగా ఉండే ఈ స్టయిల్‌లొ ఆడితే అన్నీ కలిసొస్తే హీరోలా కనిపిస్తారు, లేకపోతే ఇలా విమర్శలు తప్పవు. ఈసారి పంత్ అగ్రెసివ్ ప్రయత్నం విఫలమై విమర్శలకు గురయ్యాడు. గువాహటి టెస్టులో సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. పరిస్థితులను బట్టి చూస్తే 450 – 500 మధ్యలో ఆధిక్యం ఉంచుకుని ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version