Ashwin : విండీస్‌తో సిరీస్‌కు అశ్విన్ ఔట్‌

సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా స్వదేశం చేరుకుంది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ఫిబ్రవరి 6 నుండి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది.

Published By: HashtagU Telugu Desk
Ashwin

Ashwin

సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా స్వదేశం చేరుకుంది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ఫిబ్రవరి 6 నుండి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందే భారత్‌కు షాక్ తగిలింది. గాయం కారణంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవలే అన్నీ ఫార్మాట్లలో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిన అశ్విన్‌.. దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడ్డాడు. దానికి సర్జరీ కోసమే జట్టు సెలక్షన్‌లో అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అటు సీనియర్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా విండీస్‌తో సిరీస్‌కు దూరం కానున్నాడు. వర్క్ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా బుమ్రాకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులోకి తిరిగి రానున్నాడు. గత కొన్ని రోజులుగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన రోహిత్‌శర్మ బరువు తగ్గాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న హిట్‌మ్యాన్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో రోహిత్ సారథ్యంలోనే భారత్ విండీస్‌తో సిరీస్‌లో తలపడనుంది. అలాగే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులోకి రానుండగా దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2021లో పేలవ ప్రదర్శనకు తోడు… ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వెస్టిండీస్‌తో సిరీస్‌తో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీసు చేస్తున్న అతడు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  Last Updated: 27 Jan 2022, 10:43 AM IST