Ashwin: అశ్విన్ 3 రోజుల్లో జట్టుతో కలుస్తాడు

ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా బయలుదేరినప్పుడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ జట్టుతో పాటు కనిపించలేదు.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 08:58 PM IST

ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా బయలుదేరినప్పుడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ జట్టుతో పాటు కనిపించలేదు. టెస్ట్ టీమ్‌లో రెగ్యులర్‌గా ఉంటున్న అశ్విన్‌ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీసీసీఐ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఏం జరిగిందన్న దానిపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అశ్విన్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాష్ కోవిడ్ బారిన పడినట్టు తేలింది.

ప్రస్తుతం అతడు క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం. అందుకే ఇంగ్లాండ్ వెళ్లలేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. క్వారంటైన్ లో ఉన్న అశ్విన్ కరోనా నుండి కోలుకున్న తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు తెలిసింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ కు తప్పకుండా అతడు అందుబాటులో ఉంటాడనే నమ్మకముందని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉంటే జూన్ 24 నుండి లీసెస్ స్టైర్ తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు అశ్విన్ అందుబాటులో ఉండడం లేదు. ఇక
గాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమవడంతో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. కాగా ఇంగ్లాండ్ వెళ్లిన టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. కోహ్లీ, రోహిత్‌శర్మ, పుజారా , శుభమన్‌గిల్ వంటి ఆటగాళ్ళందరూ నెట్స్‌లో శ్రమిస్తున్నారు.

చివరి టెస్టులోనూ గెలిచి ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఇటీవల కౌంటీ క్రికెట్ ఆడిన పుజారా వరుస సెంచరీలతో ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. అటు ఈ మ్యాచ్‌ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా కీలకం కానుంది. దాదాపు మూడేళ్ళుగా ఏ ఫార్మేట్‌లోనూ శతకం సాధించని కోహ్లీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. దీంతో కలిసొచ్చి ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీతో విరాట్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.