ICC Ranking: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన అశ్విన్, శ్రేయాస్ అయ్యర్‌

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటిన పలువురు భారత క్రికెటర్లు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 11:06 PM IST

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటిన పలువురు భారత క్రికెటర్లు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. బంగ్లాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన అయ్యర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు సపోర్ట్ ఇస్తూ 29 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అయ్యర్‌ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 666 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మిగిలిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులు చోటు చేసుకోలేదు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. బంగ్లాతో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన పంత్‌ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రోహిత్‌ శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. విరాట్‌ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 14వ స్థానంలో ఉండగా.. బంగ్లాతో సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికైన పుజారా కూడా మూడు స్థానాలు దిగజారి 19వ స్థానంలో నిలిచాడు.

మరోవైపు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్‌లో బాగా మెరుగయ్యాడు. బౌలింగ్ జాబితాలో బూమ్రాతో పాటు అశ్విన్‌ ఐదో స్థానంలో నిలిచాడు. బూమ్రా నాలుగో స్థానంలో ఉండగా.. ఆసీస్ పేసర్ కమ్మిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాతో రెండో టెస్టులో అశ్విన్‌ ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 145 పరుగులను చేధించే ‍క్రమంలో 70 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయాస్‌ అయ్యర్‌తో కలిసి అశ్విన్‌ 71 పరుగుల కీలక పార్టనర్‌షిప్‌తో జట్టును గెలిపించాడు. అటు ఆల్‌రౌండర్ జాబితాలోనూ అశ్విన్ అదరగొట్టాడు. తాజాగా జాబితాలో అశ్విన్ 343 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 369 పాయింట్లతో జడేజా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే బౌలర్ల జాబితాలో అక్షర్‌ పటేల్‌ ఒక స్థానం దిగజారి 19వ స్థానంలో నిలిచాడు.