Site icon HashtagU Telugu

India vs Australia 2nd Test Day 2: రెండో రోజు నువ్వా నేనా

IND vs AUS Test

IND vs AUS Test

ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) రెండో టెస్ట్ (2nd Test) రసవత్తరంగా సాగుతోంది. ఆసీస్ తరహాలోనే భారత బ్యాటర్లు కూడా తడబడి నిలబడ్డారు. రెండోరోజు ఆట ఆరంభంలోనే టీమిండియా కీలక బ్యాటర్లు నిరాశపరిచారు. స్పిన్ పిచ్‌పై ఆసీస్ స్పిన్నర్ నాథన్ ల్యాన్‌ రాణించడంతో రోహిత్ శర్మ 32 పరుగులతో పర్వాలేదనిపించినా.. కెఎల్ రాహుల్ 17 , శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులకే ఔటయ్యారు. వందో టెస్ట్ ఆడుతున్న పుజారా డకౌటయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. జడేజా 26 , శ్రీకర్ భరత్ 6 పరుగులకు ఔటవగా.. కోహ్లీ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర వివాదాస్పద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 135 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో త్వరగానే ఆలౌటవుతుందని అనిపించింది. అయితే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, అశ్విన్‌ మరోసారి కీలక పార్టనర్‌షిప్‌తో ఆదుకున్నారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ మరోసారి తన బ్యాటింగ్‌ సత్తా నిరూపించుకున్నాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు.

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర్ పటేల్ అశ్విన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అశ్విన్ 37 రన్స్ చేయగా.. అక్షర్ పటేల్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్‌కు (India Innings) 262 పరుగుల దగ్గర తెరపడింది. ఆసీస్ బౌలర్లలో ల్యాన్ 5 , మర్ఫీ 2 , ఖుహ్నెమన్‌ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 1 పరుగు ఆధిక్యం దక్కింది. ఇలా ఒక పరుగు ఆధిక్యం రావడం టెస్టుల్లో చాలా అరుదుగా జరుగుతుంటుంది. వెంటనే రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఉస్మాన్ ఖవాజా 6 రన్స్‌కే జడేజా బౌలింగ్‌లో ఔటవగా.. ట్రావిస్ హెడ్ , లబూషేన్ ధాటిగా ఆడారు. ఆట ముగిసే సమయానికి కేవలం 12 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. హెడ్ 39 , లబూషేన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. మూడోరోజు తొలి రెండు సెషన్లు కీలకం కానున్నాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నా బ్యాటర్లు కాసేపు క్రీజులో నిలబడితే పరుగులు సాధించే అవకాశముంది. దీంతో మూడోరోజు ఆట మరింత రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read:  Heart Pain & Chest Pain: ఛాతి నొప్పి, గుండె నొప్పి ఒక్కటేనా?