Pant Captaincy: పంత్‌ చేసిన తప్పిదం అదే : నెహ్రా

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా పరాజయం అందరినీ షాక్‌కు గురిచేసింది.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 10:20 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా పరాజయం అందరినీ షాక్‌కు గురిచేసింది. 211 పరుగుల భారీస్కోర్ చేసినా బౌలర్ల వైఫల్యంతో టీమిండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. కెఎల్ రాహుల్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న పంత్ జట్టును సమర్థవంతంగా లీడ్ చేయలేకపోయాడు.

పంత్ కెప్టెన్సీపై మాజీ ఆటగాళ్ళు విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా చేరాడు. కొన్ని నిర్ణయాల్లో పంత్ ఇంకా పరిణితి చూపించాలన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విన్నర్ అయిన యజువేంద్ర చాహల్‌తో కేవలం 2 ఓవర్లే బౌలింగ్ చేయించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని స్పష్టం చేశాడు. చాహల్ లాంటి స్పిన్నర్‌కు పూర్తి కోటా బౌలింగ్ ఇవ్వకపోవడం సరికాదన్నాడు.
రిషభ్ పంత్ మెరుగ్గా ఎలా రాణించాలో క్రమేణా నేర్చుకుంటాడనీ నెహ్రా అభిప్రాయపడ్డాడు. అయితే చాహల్‌తో ఓవర్ బౌలింగ్ చేయించాలనుకుంటే ద్రావిడ్ ఆ మెసేజ్ తప్పకుండా పంపే ఉంటాడని వ్యాఖ్యానించాడు. వాళ్లు ఈ విషయంలో సింపుల్‌గా, చురుకుగా ఉండాలన్నాడు. చాహల్ లాంటి స్టార్ బౌలర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. డుస్సెన్, మిల్లర్ జోడీకి చాహల్ బౌలింగ్ చేసి ఉండాల్సిందని, ఈ విషయంలో పంత్ ఖచ్చితంగా తప్పు చేశాడని నెహ్రా విశ్లేషించాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లలో ఐదుగురు బౌలర్లను ఉపయోగించాడంపైనా పంత్ నిర్ణయాలను నెహ్రా తప్పుపట్టాడు.

ఈ మ్యాచ్‌లో చాహల్ కేవలం 2 ఓవర్లు వేసి బంతులు వేసి 26 పరుగులిచ్చాడు. డుసెన్-మిల్లర్ ధాటిగా ఆడుతున్నప్పుడు పంత్‌ చాహల్‌కు బౌలింగ్ ఇవ్వలేదు మిగిలిన బౌలర్లు పూర్తిగా నిరాశపరిచినా పంత్‌ను ఎందుకు ఉపయోగించుకోలేదో తనకు అర్థం కాలేదని నెహ్రా వ్యాఖ్యానించాడు.
దిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 212 పరుగుల టార్గెట్‌ను సఫారీలు సునాయాసంగా ఛేదించారు. సిరీస్‌లో రెండో వన్డే కటక్ వేదికగా ఆదివారం జరుగుతుంది.