Site icon HashtagU Telugu

PBKS vs MI:వాంఖడేలో ముుంబైకి షాక్.. హై స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ

PBKS Team 2025 Player List

PBKS Team 2025 Player List

PBKS vs MI: వీకెండ్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు ఐపీఎల్ మరింత కిక్ ఇస్తోంది. సాయంత్రం మ్యాచ్ లో స్కోరింగ్ తో టెన్షన్ పెడితే.. రాత్రి మ్యాచ్ హైస్కోరింగ్ తో ఉత్కంఠకు గురిచేసింది. పరుగుల వరద పారిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది.

వాంఖడే స్టేడియం వేదికగా 13 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. చివరి వరకూ సాగిన ఈ పోరు అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కనీసం 150 స్కోరైనా చేస్తుందా అనిపించింది.

అయితే ముంబై యువ బౌలర్ అర్జున్ టెండూల్కర్ వేసిన ఓవర్ పంజాబ్ తలరాతనే మార్చేసింది. తొలి రెండు ఓవర్లలో ఆకట్టుకున్న అర్జున్ తన మూడో ఓవర్ లో ఏకంగా 31 పరుగులు ఇచ్చేయడం ముంబై కొంపముంచింది. నిజానికి 10 ఓవర్ల వరకూ
పంజాబ్ 4 వికెట్లకు 83 పరుగులే చేసింది. ఈ దశలో కెప్టెన్ శామ్ కర్రాన్, హర్‌ప్రీత్ సింగ్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివరి ఆరు ఓవర్లలో పంజాబ్ 109 పరుగులు చేసింది. పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ పీయూష్ చావ్లా మాత్రమే ఆకట్టుకోగా… మిగిలిన వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వికెట్లు తీసినప్పటకీ చివరి ఓవర్లలో ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేశారు. వాంఖేడే స్టేడియంలో బౌండరీలు చిన్నవిగా ఉండడం, పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో పంజాబ్ భారీ టార్గెట్ ను ముంబై ముందు ఉంచగలిగింది.

భారీ లక్ష్యఛేదనలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. అయితే రోహిత్ శర్మ, కామెరూన్ గ్రీన్ రెచ్చిపోయారు. భారీ షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ముంబై పవర్ ప్లేలో 54 పరుగులు చేసింది. రోహిత్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేయగా.. గ్రీన్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 రన్స్ చేశాడు. రోహిత్ ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఒక దశలో ముంబై విజయం ఖాయమైనట్టే కనిపించింది. సూర్యకుమార్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు.

అయితే గ్రీన్ , సూర్య స్వల్ప వ్యవధిలో ఔటవడంతో పంజాబ్ పుంజుకుంది. సూర్యకుమార్ కేవలం 26 బంతుల్లోనే 57 రన్స్ చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో విజయం కోసం 18 రన్స్ చేయాల్సి ఉండగా…అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసి పంజాబ్ ను గెలిపించాడు. దీంతో ముంబై ఇండియన్స్ 201 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్ లో ముంబైకి ఇది మూడో ఓటమి కాగా పంజాబ్ కు నాలుగో విజయం.