ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ (18th Edition of the Indian Premier League) సమీపిస్తుండడంతో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. మంగళవారం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యంతో కలిసి హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐపీఎల్ పాలకమండలి నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గత ఏడాది కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు, వాష్‌రూమ్‌లు సరిగా పనిచేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అలాంటి సమస్యలు ఈసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు సూచించారు. అదనంగా, టిక్కెట్ల విక్రయ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, స్టేడియంలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతపై కఠిన నియంత్రణలు పెట్టాలని, అధిక ధరలకు వాటిని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ తదితరులు డ్రెసింగ్ రూములు, కార్పొరేట్ బాక్సుల్లో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అన్ని సౌకర్యాలను మెరుగుపరచాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Fact Check: మనుషుల కంటే అగ్నిపర్వతాలే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయా ?
ఈ సమీక్ష సమావేశానికి బీసీసీఐ నుంచి వైభవ్, యువరాజ్, హెచ్‌సీఏ సీఈఓ సునీల్, ఎస్‌ఆర్‌హెచ్ నుంచి శరవణన్, రోహిత్ తదితరులు హాజరయ్యారు. ఐపీఎల్ మ్యాచ్‌లను హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అభిమానులకు బెస్ట్ అనుభవం కల్పించేందుకు ప్రత్యేకంగా శ్రమిస్తున్నామని, స్టేడియం నిర్వహణలో ఏ చిన్న లోపం లేకుండా చూసుకుంటామని హెచ్‌సీఏ భరోసా ఇచ్చింది.