Site icon HashtagU Telugu

Arjun Tendulkar: తండ్రిలానే తనయుడు.. రంజీ అరంగేట్రంలోనే సెంచరీ

Arjun Tendulkar

Cropped (2)

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రంజీ క్రికెట్ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. ముంబై తరపున అవకాశాలు రాక గోవాకు మారిపోయిన అర్జున్ (Arjun Tendulkar) తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్‌ 15 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. రెండో రోజు మాత్రం తన సత్తా ఏమిటో చూపుతూ విజృంభించాడు. 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 120 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.

మరో బ్యాటర్ సుయాంశ్‌ ప్రభుదేశాయ్‌తో కలిసి అర్జున్‌ గోవా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 221 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో గోవా జట్టు రెండో రోజు ఆట ముగిసేసమయానికి 493 పరుగుల భారీ స్కోరు చేసింది.గతంలో సచిన్‌ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. 1988 రంజీ ట్రోఫీలోకి కేవలం 15 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్‌ మొదటి సెంచరీని నమోదు చేశాడు.

Also Read: New Zealand: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్

మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ వయసు 15 ఏళ్లు కాగా అర్జున్ టెండూల్కర్ రంజీ ఆరంగ్రేటం చేసేందుకు 23 ఏళ్ల వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2018 శ్రీలంక పర్యటనలో భాగంగా అండర్-19 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అర్జున్‌.. ప్రపంచకప్‌ జట్టులో మాత్రం ఆడలేకపోయాడు. ఐపీఎల్ లో ముంబయి ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా అర్జున్ కు ఛాన్స్ రాలేదు.