Fifa World Cup: అర్జెంటీనాదే సాకర్ వరల్డ్‌కప్‌

రెండు కొదమసింహాలు తలపడితే ఎలా ఉంటుంది...సరిగ్గా సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అలాగే జరిగింది..

  • Written By:
  • Updated On - December 18, 2022 / 11:51 PM IST

రెండు కొదమసింహాలు తలపడితే ఎలా ఉంటుంది…సరిగ్గా సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అలాగే జరిగింది.. రెండు అత్యుత్తమ జట్లు ప్రపంచకప్‌ కోసం చివరి వరకూ పోరాడితే ఆ కిక్కే వేరు.. అది మాటల్లో చెప్పేది కాదు.. చూసి తీరాల్సిందే… ఖతార్ వేదికగా ఇలాంటి కిక్‌ను ఆస్వాదించారు ఫ్యాన్స్‌.. అనూహ్య మలుపులు..చివరి నిమిషాల్లో ఆధిపత్యం తారుమారు..ఇంకా చెప్పాలంటే ఎవరికి వారే తగ్గేదే లే అంటూ సాగిన పోరు..చివరికి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా పై చేయి సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్ ఆద్యంతం అభిమానులను ఉర్రూతలూగించింది. ఫస్టాఫ్‌లోనే అర్జెంటీనా రెండు గోల్స్ చేసి ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ చివర్లో అనూహ్యంగా పుంజుకున్న ఫ్రాన్స్ 2 గోల్స్‌తో స్కోర్ సమం చేసింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబెపె 2 నిమిషాల్లోనే రెండు గోల్స్ కొట్టాడు. తర్వాత ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఇక్కడ కూడా ఇరు జట్లూ చెరొక గోల్ చేయడంతో మళ్ళీ స్కోర్ సమమైంది. దీంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనాదే పైచేయిగా నిలిచింది. ఈ విజయంతో ప్రపంచకప్ గెలవాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు మెస్సీ. విజేతగా నిలిచిన అర్జెంటీనాకు 368 కోట్లు, రన్నరప్‌ ఫ్రాన్స్‌కు 249 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.