ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న కోహ్లీ భార్య‌?!

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. అనుష్క శర్మ ఆర్సీబీ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి యాజమాన్య బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం లేదు. దానికి బదులుగా జట్టులో ఒక చిన్న వాటాను దక్కించుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Anushka Sharma

Anushka Sharma

Anushka Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ జట్టును కొనుగోలు చేయడానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అదర్ పూనావాలా ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఆర్సీబీ ఫ్రాంచైజీలో వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. అనుష్క శర్మ ఆర్సీబీ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి యాజమాన్య బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం లేదు. దానికి బదులుగా జట్టులో ఒక చిన్న వాటాను దక్కించుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఆర్సీబీలో 3 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ జట్టు ఉన్న విలువ ప్రకారం.. ఈ 3 శాతం వాటా కోసం ఆమె సుమారు 400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: కలబంద తొక్కలను పారేస్తున్నారా? అయితే ఉపయోగించండిలా!

ఐపీఎల్ 2025 విజేత అయిన ఆర్సీబీ యాజమాన్య హక్కులు ప్రస్తుతం ‘డియాజియో’ సంస్థ వద్ద ఉన్నాయి. మార్చి 2026 నాటికి ఈ సంస్థ ఆర్సీబీ యాజమాన్యం నుండి పూర్తిగా తప్పుకోనుంది. ప్రస్తుతం అనుష్క శర్మకు గానీ, విరాట్ కోహ్లీకి గానీ ఈ జట్టులో ఎటువంటి వాటా లేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే విరాట్ కోహ్లీ కుటుంబం బెంగళూరు ఫ్రాంచైజీలో వాటాను కొనుగోలు చేయడానికి బీసీసీఐ అనుమతిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

బీసీసీఐ నిబంధన అడ్డు వస్తుందా?

విరాట్ కోహ్లీ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నారు. ఆర్సీబీని ఒక పెద్ద బ్రాండ్‌గా మార్చడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అయితే విరాట్ కోహ్లీ లేదా ఆయన కుటుంబ సభ్యులు జట్టులో వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే బీసీసీఐ నిబంధనలు అడ్డు తగిలే అవకాశం ఉంది.

నిజానికి 2007లో బీసీసీఐ ఒక నిబంధనను తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో ఎటువంటి వాటాలను కొనుగోలు చేయకూడదు. అయితే నివేదికల ప్రకారం విరాట్ కాకుండా ఆయన భార్య అనుష్క శర్మ ఈ వాటాను కొనుగోలు చేయబోతున్నారు.

రేసులో రణ్‌బీర్ కపూర్ కూడా..

కేవలం అనుష్క శర్మ మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కూడా ఆర్సీబీ ఫ్రాంచైజీలో 2 శాతం వాటాను కొనుగోలు చేయాలని చూస్తున్నారట. దీని కోసం ఆయన 300 నుండి 350 కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

  Last Updated: 24 Jan 2026, 10:23 PM IST