RCB vs RR IPL 2023: హోం గ్రౌండ్ లో బెంగుళూరు మరో విక్టరీ.. పోరాడి ఓడిన రాజస్థాన్

ఐపీఎల్ 16వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై భారీ స్కోరును కాపాడుకుంటూ రాజస్థాన్ రాయల్స్ పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - April 23, 2023 / 08:27 PM IST

RCB vs RR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) నాలుగో విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై భారీ స్కోరును కాపాడుకుంటూ రాజస్థాన్ రాయల్స్ (RR) పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరుకు రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ షాక్ ఇచ్చాడు. బెంగుళూరు స్టార్ బ్యాటర్ కోహ్లీని డకౌట్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే షెబాజ్ అహ్మద్ ను పెవిలియన్ కు పంపాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీని ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. వీరిద్దరూ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడటంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.

అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును టాప్ గేర్ లో పరుగెత్తించింది. మ్యాక్స్‌వెల్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా… ఆ డుప్లెసిస్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో డుప్లెసిస్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. వీరిద్దరూ మూడో వికెట్ కు చాలా వేగంగా 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే డుప్లెసిస్‌ను రనౌట్, ఆ వెంటనే మ్యాక్స్‌వెల్ కూడా ఔటవడంతో బెంగుళూరు స్కోర్ వేగం తగ్గింది. చివర్లో అంచనాలు పెట్టుకున్న మిగిలిన వారంతా నిరాశ పరిచారు. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న బెంగుళూరు 189 పరుగులకు పరిమితమయింది.

భారీ టార్గెట్ చేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బెంగుళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే డేంజరస్ బట్లర్ ను ఔట్ చేశాడు. అయితే జైస్వాల్ , పడిక్కల్ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టారు. భారీ షాట్లతో అదరగొట్టిన వీరిద్దరూ బెంగుళూరు బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. రెండో వికెట్ కు 98 పరుగులు జోడించారు. పడిక్కల్ 34 బంతుల్లో 52 , జైస్వాల్ 47 రన్స్ చేశారు. వీరిద్దరూ ఔట్ అయ్యాక మ్యాచ్ లో పుంజుకున్న బెంగుళూరు వరుస వికెట్లు తీస్తూ వత్తిడి పెంచింది. సంజూ శాంసన్, హిట్ మేయిర్ తమ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. ధృవ్ జురేల్ ధాటిగా ఆడినా చివర్లో బెంగుళూరు బౌలర్లు కట్టడి చేశారు.

చివరి ఓవర్లో విజయం కోసం 19 రన్స్ చేయాల్సి ఉండగా…అశ్విన్ రెండు ఫోర్లు కొట్టడంతో మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. అయితే హర్షల్ పటేల్ అశ్విన్ ను ఔట్ చేసి రాయల్స్ జోరుకు బ్రేక్ వేశాడు.దీంతో రాజస్థాన్ 182 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్ లో బెంగుళూరుకు ఇది నాలుగో విజయం.

Also Read:  Salary Account vs Savings Account: మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి..