హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆట కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అవినీతి ఆరోపణలు (Accusations) అంతర్గత విబేధాలు సరేసరి భారత్ (India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పదవీ కాలం ముగిసినా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ అజారుద్దీన్ పై ఆగ్రహంతో ఉన్న అసమ్మతి వర్గం ప్రత్యేక ఏజీఏం నిర్వహించేందుకు సన్నద్ధమయింది. అయితే అజారుద్దీన్ HCA సభ్యులను ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లోపలికి రానీయకుండా సిబ్బందితో గేట్లు మూయించడం దుమారం రేపుతోంది. దీంతో గేటు బయటే టెంట్ వేసుకొని వారంతా ప్రత్యేక AGM నిర్వహించుకున్నారు.
అజారుద్దీన్ (Azharuddin) తీరుపై HCA మాజీ సెక్రటరీ శేషు నారాయణ మండిపడ్డారు. సమావేశానికి తమను అనుమతించకుండా గేట్లను మూసేయడం దారుణమని, తెలంగాణ రాష్టానికి ఇది బ్లాక్ డే అని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శేషు నారాయణ డిమాండ్ చేశారు. జనరల్ బాడీ లోపల పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని, HCA సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
సెప్టెంబర్ 26న అజారుద్దీన్ పదవీకాలం ముగిసిందని, కానీ ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదని శేషు నారాయణ తెలిపారు. జనవరి 10న HCA ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించారు. పదవీకాలం ముగిసినా ఇంకా అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, వచ్చే నెలలో ఎన్నికలు జరిపి తీరుతామని మాజీ ప్రెసిడెంట్ వినోద్ చెప్పారు. సభ్యులందరం కలిసి హెచ్‌సీఏను కాపాడుతామని స్పష్టం చేశారు. అజారుద్దీన్ (Azharuddin) అధ్యక్షుడయ్యాక హెచ్‌సీఏ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటుంది. గతంలో మ్యాచ్ నిర్వహణ, టికెట్ల ఇష్యూలో హెచ్‌సీఏ వైఫల్యం చెందిందనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఇక హెచ్‌సీఏ తరపున ఆటగాళ్లను ఆడించడం కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిభావంతులైన క్రికెటర్లకు అన్యాయం జరుగుతూనే ఉందనీ పలువురు మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి ఆరోపణలు రాకుండా అన్ని వివాదాలకు ముగింపు పడాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Kanpur : కాన్పూర్‌లో ఐదుగురు బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు