Angelo Mathews : టైమ్డ్ ఔట్ వివాదం.. ఐసీసీకి మాథ్యూస్ ఫిర్యాదు

బంగ్లా, లంక మ్యాచ్ లో సదీర సమరవిక్రమ అవుటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews) మైదానంలోకి వచ్చాడు.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 02:58 PM IST

Angelo Mathews Complaint to ICC : వన్డే ప్రపంచకప్ లో రెండు సెమీఫైనల్ బెర్తులు ఇప్పటికే ఖరారయ్యాయి. మిగిలిన రెండు బెర్తుల కోసం 4 జట్లు రేసులో ఉన్నాయి. అయితే అంతగా ప్రాధాన్యత లేని బంగ్లాదేశ్ , శ్రీలంక మ్యాచ్ ప్రస్తుత వరల్డ్ కప్ లో చర్చనీయాంశమైంది. లంక క్రికెటర్ మాథ్యూస్ (Angelo Mathews)ను టైమ్డ్ ఔట్ గా ప్రకటించడమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ టైమ్డ్ ఔట్ తీవ్ర దుమారం రేపుతోంది. నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ అప్పీల్ కరెక్టేనని పలువురు వాదిస్తుంటే.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే టైమ్డ్ ఔట్ గా వెనుదిరిగిన మాథ్యూస్ దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు.

నిబంధనల ప్రకారం తనకు ఇంకా 5 సెకన్ల సమయం మిగిలి ఉందని, అంపైర్లు దీనిని పరిశీలించకుండా ఔట్ గా ప్రకటించారని మాథ్యూస్ (Angelo Mathews) వాదిస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాలను ఐసీసీకి పంపించాడు. కొన్ని టీవీ స్క్రీన్ షాట్లు, స్పోర్ట్స్ యాప్స్‌లో రికార్డయిన టైమ్‌ ప్రూఫ్స్‌ను అతను ఐసీసీకి అందజేశాడు. 5 సెకన్లు మిగిలివుండగానే తనను అంపైర్ టైమ్ అవుట్‌గా ప్రకటించారని మాథ్యూస్ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

బంగ్లా, లంక మ్యాచ్ లో సదీర సమరవిక్రమ అవుటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews) మైదానంలోకి వచ్చాడు. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.

దీంతో మరో హెల్మెట్ కోసం మాథ్యూస్ తన టీం ప్లేయర్ ను పిలిచాడు. సరిగ్గా అదే సమయంలో బంగ్లా కెప్టెన్ షకీబుల్ టైమ్డ్ ఔట్ రూల్ ను వాడుకున్నాడు. మాథ్యూస్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక వికెట్ పడినప్పుడు.. తర్వాతి బ్యాటర్ క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవడానికి 2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఒకవేళ బ్యాటర్ కనుక ఈ రెండు నిమిషాల్లో రెడీ అవ్వకపోతే అతన్ని టైమ్డ్ అవుట్‌గా అంపైర్లు ప్రకటిస్తారు. ఈ నిబంధనను వాడుకున్న షకీబ్.. మాథ్యూస్ ఔట్ కోసం అప్పీల్ చేయడం.. అంపైర్లు ఔట్ గా ప్రకటించడం జరిగిపోయాయి. పెవిలియన్ కు వెళుతూ మాథ్యూస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

బంగ్లా ఇన్నింగ్స్ సమయంలోనూ ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. బంగ్లా బ్యాటర్లు సమయం వృథా చేసినప్పుడల్లా మాథ్యూస్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. షకీబుల్ ను ఔట్ చేసిన మాథ్యూస్ తనకు టైమ్ వచ్చిందంటూ కౌంటర్ ఇచ్చాడు. కాగా మాథ్యూస్ 5 సెకన్లు మిగిలి ఉందన్న ఆధారాలపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read:  Winter Foods For Kids: చలికాలంలో పిల్లలకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోండి ఇలా..!