Site icon HashtagU Telugu

Andrew Symonds: రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మృతి

Andrew Symonds

Andrew Symonds

ఆస్ట్రేలియా క్రికెట్ లో మరో పెనువిషాదం నెలకొంది. ఈ మధ్యే ఆ జట్టు మాజీ క్రికెటర్, ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, మరో మాజీ క్రికెటర్ రాడ్ మార్ష్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జట్టు మాజీ క్రికెటర్ ఎక్స్ ప్టోజివ్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు . 46ఏళ్లసైమండ్స్ ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు, 198వన్డేల్లో ఆడాడు. క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని టౌన్స్ విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో సైమండ్స్ ఒక్కరే ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవింగ్ సీట్లో ఉన్న సైమండ్స్ ను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. కారు బోల్తా పడటంతో తీవ్రగాయాలై సైమండ్స్ అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడు సైమండ్స్ అనే విషయాన్ని అధికారులు మొదట గుర్తించలేకపోయారు. మీడియా సంస్థలు అతడిని సైమండ్స్ గా గుర్తించాయి. సైమండ్స్ మరణ వార్త తెలియగానే క్రికెట్ ప్రపంచం ఒకసారిగా షాక్ కు గురైంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు షాక్ తో ట్వీట్స్ చేశారు.

సైమండ్స్ సహచరులు జాసన్ గిలెస్పీ, ఆడం గిల్ క్రిస్ట్, పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్వీట్లతో తమ బాధను వ్యక్తపరిచారు. సైమండ్స్ మరణించారన్న వార్తను నమ్మలేకపోతున్నామని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ లో ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరుగాంచిన సైమండ్స 2003, 2007 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. మంకీ కుంభకోణం సైమండ్స్ జీవితంలో మాయని మచ్చలా నిలిచిపోయింది. 2008లో సిడ్నీలో భారతత్ జరిగిన న్యూఇయర్ టెస్టులో హర్బజన్ సింగ్ ను ఉద్దేశించి మంకీ అని సైమండ్స్ పిలవడం క్రికెట్ లో పెనుదుమారానికి కారణమైంది.