Site icon HashtagU Telugu

Kohli : శాసించిన స్థితి నుండి ఒంటరిగా మిగిలాడు…

kohli

kohli

విరాట్ కోహ్లీ… భారత క్రికెట్ లో దూకుడుకు కేరాఫ్ అడ్రస్.. రికార్డుల రారాజు…పరుగుల యంత్రం…చేజింగ్ కింగ్.. గంగూలీ తర్వాత మైదానంలో అత్యంత దూకుడు కలిగిన కెప్టెన్. కూల్ కెప్టెన్ ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న విరాట్ భారత్ జట్టును సక్సెస్ ఫుల్ గానే లీడ్ చేశాడు. వన్డేల్లో ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేక పోయినప్పటికీ….టెస్టుల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లు జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీ పోవడానికి , తప్పుకోవడానికి కారణాలు ఒకసారి చూస్తే .

1. సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ జట్టులో కోహ్లీ ఏది చెబితే అదే జరిగింది. జట్టు ఎంపికలో కోహ్లీ మాటే చెల్లుబాటు అయింది. తనకు అత్యంత ఇష్టం అయిన వ్యక్తి రవి శాస్త్రిని కోచ్ గా తెచ్చుకున్న విరాట్ ఆధిపత్యం బీసీసీఐ లో కొందరికి నచ్చలేదు. గంగూలీ బోర్డు ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత కోహ్లీకి చెక్ పెట్టడం మొదలయింది.

2. రవి శాస్త్రి పదవీ కాలం ముగియడంతో కొత్త కోచ్ ఎవరు వచ్చినా తనకు అనుకూలంగా ఉండే అవకాశం లేదని కోహ్లీ ముందే ఊహించాడు. దీనికి తోడు వన్డే కెప్టెన్ గా ఐసీసీ టోర్నీ గెలవలేక పోయాడన్న విమర్శలకు తోడు వ్యక్తిగత ఫామ్ కోల్పోవడం మరింత ప్రతికూలంగా మారింది.

3. ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్సీ వైఫల్యం, పేలవ ఫామ్‌.. కోహ్లీని పునరాలోచనలో పడేశాయి. ఈ క్రమంలో 2021, సెప్టెంబరు 16న తాను టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. ఆ టోర్నీలో భారత్ జట్టు కనీసం సెమీస్‌కి కూడా చేరలేకపోయింది.

4. ఆ తర్వాత కోహ్లీని సడన్‌గా వన్డే కెప్టెన్సీ నుంచి భారత సెలెక్టర్లు తప్పించారు. సెలెక్టర్ల నిర్ణయం కోహ్లీని వ్యక్తిగతంగా బాధించింది. దానికితోడు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించే ముందు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. కోహ్లీతో మాట్లాడినట్లు చెప్పాడు. కానీ.. కోహ్లీ మాత్రం తనతో గంగూలీ మాట్లాడలేదని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పడంతో.. వివాదం రాజుకుంది.

5. ఈ ఎపిసోడ్ తర్వాత బీసీసీఐ తో కోహ్లీ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. టీమ్ లో పూర్తిగా ఒంటరి వాడిగా మిగిలాడు. దీనికి తోడు సీరీస్ ఓటమితో తన కెప్టెన్సీ భవిష్యత్తు విరాట్ కు అర్థమయింది. బోర్డు వేటు వేయక ముందే తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని భావించిన కోహ్లీ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. నిజానికి టీమ్ మేనేజ్ మెంట్ కు ముందే తన నిర్ణయాన్ని చెప్పిన విరాట్ బీసీసీఐకి మాత్రం ఒకరోజు తర్వాత సమాచారమిచ్చాడు. బీసీసీఐ బాస్ గంగూలీ కి కాకుండా సెక్రటరీ జై షాకు మాత్రమే ఫోన్ చేశాడు.

మొత్తం మీద ఏడేళ్ల పాటు సారథిగా తన మాటకు తిరుగులేకుండా టీమ్ ఇండియాను శాసించిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పతనం అయిదు నెలల్లోనే ముగిసిపోయింది. రానున్న రోజుల్లో ఆటగాడిగా అయినా మళ్ళీ ఫామ్ అందుకుంటడేమో చూడాలి.

Cover Photo Courtesy: BCCI

Exit mobile version