టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు (India Women) శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 27 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ సరైన ఆరంభం దక్కలేదు. టాపార్డర్ , మిడిలార్డర్ నిరాశపరిచారు. దీంతో 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ భాటియా 35 పరుగులు చేయగా.. చివర్లో దీప్తి శర్మ, అమన్ జోత్ కౌర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 76 పరుగులు జోడించడంతో భారత్ 147 పరుగులు చేయగలిగింది. దీప్తి శర్మ 23 బంతుల్లో 33 రన్స్ చేయగా… కౌర్ 30 బంతుల్లోనే 7 ఫోర్లతో 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
Also Read: Several Flights Delayed: పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, రైళ్లు
ఛేజింగ్ లో సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. ముఖ్యంగా దీప్తి శర్మ బంతితోనూ అదరగొట్టింది. కీలక వికెట్లు పడగొట్టి సఫారీలను దెబ్బతీసింది. కెప్టెన్ లూస్ 29 , మరో బ్యాటర్ ట్రయాన్ 26 , కాప్ 22 రన్స్ తప్పిస్తే మిగిలిన వారంతా భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 120 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తిశర్మ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అలాగే దేవిక 2 , స్నేహా , రాజేశ్వరి, రాధా యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అమన్ జోత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. భారత్ తన తర్వాతి మ్యాచ్ లో సోమవారం వెస్టిండీస్ తో తలపడుతుంది.