Site icon HashtagU Telugu

India Warm Up Match: రెండో వార్మప్ మ్యాచ్ లోనూ భారత్ విజయం

Harshal

Harshal

ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సీరీస్ కు ముందు టీమిండియా యువ క్రికెటర్లు ఫుల్ ప్రాక్టీస్ చేశారు. వరుసగా రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ విజయం సాధించారు. డెర్బీ షైర్ తో గ్రాండ్ విక్టరీ అందుకున్న యంగ్ ఇండియా నార్తాంప్టన్‌షైర్ తో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొని గెలిచింది. బ్యాటింగ్ లో తక్కువ స్కోర్ చేసినా…బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులే చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ శాంసన్‌ డకౌట్ కాగా…రాహుల్ త్రిపాఠి 11, సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగా ఔటయ్యారు. ఈ దశలో ఇషాన్ కిషన్, కెప్టెన్ దినేశ్ కార్తీక్ కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 16, 34 పరుగులు చేసిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా ఔటయ్యాక భారత్ 120 రన్స్ చేస్తుందా అనిపించింది. అయితే హర్షల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు మంచి స్కోర్ అందించాడు.
మొదటి 15 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసిన హర్షల్ పటేల్, ఆ తర్వాత 19 బంతుల్లో 44 పరుగులు చేసి… 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

తర్వాత 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తాంప్టన్‌షైర్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ మ్యాచ్ పై పట్టు బిగించారు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నార్తాంప్టన్‌షైర్‌ 139 పరుగులకే ఆలౌటైంది. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 2 , అవేష్ ఖాన్ 2 , హార్షల్ పటేల్ 2 , చాహల్ 2 వికెట్లు పడగొట్టారు. టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం త్వరలోనే జట్టు ఎంపిక ఉన్న నేపద్యంలో యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. ఇక ఇంగ్లండ్ తో మూడు టీ ట్వంటీల సీరీస్ జులై 7 నుంచి మొదలు కానుంది.

 

Exit mobile version