Site icon HashtagU Telugu

Kolkata Punches Hyderabad: సన్ రైజర్స్ కు కోల్ కత్తా పంచ్

Andre Russell

Andre Russell

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. కోల్ కతా నిర్థేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన హైదరాబాద్ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ ఔటయ్యాడు. ఈ దశలో నితీశ్ రాణా, మరో ఓపెనర్ అజింక్య రహానే ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 48 పరుగులు జోడించారు. రాణా, రహానే ఔటైన కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ కూడా వెనుదిరగడంతో కోల్ కతా తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే శామ్ బిల్లింగ్స్ , ఆండ్రూ రస్సెల్ నైట్ రైడర్స్ ను ఆదుకున్నారు. నిలకడగా ఆడిన బిల్లింగ్స్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేయగా.. రస్సెల్ మాత్రం రెచ్చిపోయాడు. భారీ షాట్లతో సన్ రైజర్స్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. వాషింగ్టన్ సుందర్ వేసి ఆఖరు ఓవర్‌లో విధ్వంసమే సృష్టించాడు. మూడు సిక్సర్లు సహా 20 పరుగులు సాధించాడు. రస్సెల్ కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మరోసారి ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు పడగొట్టాడు.

178 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు తొలి వికెట్ కు 30 పరుగులు జోడించగా.. విలియమ్సన్ నిరాశపరిచాడు. 9 పరుగులకే కేన్ మామ ఔటవగా… రాహుల్ త్రిపాఠీ, నికోలస్ పూరన్ కూడా విఫలమయ్యారు. దీంతో సన్ రైజర్స్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ధాటిగా ఆడాడు. కోల్ కతా బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్సర్లతో 43 పరుగులకు ఔటయ్యాక… మక్రరమ్ కూడా 32 రన్స్ కు వెనుదిరగడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. తర్వాత వాషింగ్టన్ సుందర్, శశాంక్ సింగ్ వేగంగా ఆడలేకపోవడంతో హైదరాబాద్ 123 పరుగుల స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు సమిష్టిగా రాణించారు. కాగా ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి అదరగొట్టిన సన్ రైజర్స్ తాజాగా ఐదు వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచినా హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు లేనట్టే.