Team India: మిషన్ వరల్డ్ కప్ షురూ

వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం జట్టు కూర్పే లక్ష్యంగా టీమిండియా ప్రస్థానం మొదలు కాబోతోంది.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 11:10 AM IST

వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం జట్టు కూర్పే లక్ష్యంగా టీమిండియా ప్రస్థానం మొదలు కాబోతోంది. ఒకవైపు సీనియర్ టీమ్ ఇంగ్లాండ్ లో పర్యటిస్తూ ఉంటే…మరోవైపు యువ ఆటగాళ్లతో కూడిన యంగ్ ఇండియా ఐర్లాండ్ తో సీరీస్ కు సిద్ధమయింది. డబ్లిన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ జట్టే ఫేవరేట్. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా… కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక త్వరలోనే ఉండనున్న నేపద్యంలో పలువురు యువ క్రికెటర్లు తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్ లో అదరగొట్టిన దినేష్ కార్తిక్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అవేష్ ఖాన్ , ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, చాహాల్ కూడా తమ ఫామ్ కొనసాగించాలని ఎదురు చూస్తున్నారు. ఇక ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఒక్కసారిగా దూసుకొచ్చిన హార్దిక్ పాండ్య కెప్టెన్సీ కి ఈ సీరీస్ పరీక్ష కానుంది. ఐపీఎల్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ను విజయవంతంగా నడిపించి ఛాంపియన్ గా నిలిపిన పాండ్య వ్యక్తిగతంగానూ అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయస్థాయిలో తన కెప్టెన్సీ మార్క్ చూపించేందుకు ఈ సీరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు.

మరోవైపు సొంత గడ్డపై భారత్ కు గట్టి పోటీ ఇవ్వాలని ఐర్లాండ్ భావిస్తోంది. గత ఏడాది టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఐర్లాండ్‌ పెద్ద జట్టుతో మ్యాచ్‌లు ఆడలేదు. అమెరికా, యూఏ ఈలతో మాత్రమే తలపడిన ఆ టీమ్‌కు ఇన్నేళ్లలో కూడా పెద్ద జట్లను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా రాలేదు. భారత్‌ తర్వాత ఆ టీమ్‌ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ఆడనుంది. టి20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భారత్‌తో సిరీస్‌ పనికొస్తుంది. భారత్‌తో గతంలో ఆడిన 3 టి20ల్లోనూ ఐర్లాండ్‌ ఓడింది. ప్రస్తుత జట్టులోని సీనియర్లు స్టిర్లింగ్, డాక్‌రెల్‌తో పాటు కెప్టెన్‌ బల్బరీన్‌ ఆ జట్టుకు కీలకం కానున్నారు. డబ్లిన్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోరు నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.