Site icon HashtagU Telugu

Akash Deep: తుది జట్టులో నో ప్లేస్.. కట్ చేస్తే మ్యాచ్ విన్నర్

Akash Deep

Akash Deep

Akash Deep: రెండో టెస్ట్ కోసం టీమిండియా ఫైనల్ ఎలెవన్ ను ప్రకటించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. స్టార్ పేసర్ బుమ్రాను పక్కన పెట్టి ఆకాశ్ దీప్ (Akash Deep)ను తుది జట్టులోకి తీసుకోవడంపై పెదవి విరిచారు. ఎందుకంటే ఈ టూర్ ఆరంభానికి ముందే ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా లేదా అనే విషయంలో సందేహం ఉన్న ఆటగాడిగా అతని పేరే ఉంది. రెండో టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వబోతున్నారనే వార్త రాగానే అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేయవచ్చని అందరూ భావించారు.

కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆకాశ్ దీప్‌పై నమ్మకం ఉంచి ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అవకాశం కల్పించాడు. ఈ అవకాశాన్ని ఆకాశ్‌దీప్ సద్వినియోగం చేసుకుని తన అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు తీస్తే.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. చివరి రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం ఆగిన వెంటన్ ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ జట్టును చావు దెబ్బకొట్టాడు.

Also Read: Shubman Gill Captaincy: హై హై నాయకా.. గిల్ శకం మొదలైందిగా!

ఐదో రోజు ఆకాశ్ దీప్ మొదట ఓలీ పోప్‌ను ఔట్ చేశాడు. అనంతరం హ్యారీ బ్రూక్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్ ఆడేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఆకాశ్ దీప్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. డకెట్, పోప్, బ్రూక్, రూట్ వంటి కీలక వికెట్లతో భారత్ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే చివర్లో టీమిండియా విజయాన్ని ఆలస్యం చేస్తూ మెరుపులు మెరిపించిన జేమీ స్మిత్ , కార్స్ లను కూడా అతనే పెవిలియన్ కు పంపాడు.

ఫిట్ నెస్ సమస్యలతో ఇటీవల ఇబ్బందిపడిన ఆకాశ్ దీప్ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ లో ఫామ్ లోకి రావడం టీమిండియాకు మేలు చేసేదే. అదే సమయంలో మూడో టెస్టుకు ఆకాశ్ దీప్ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ కు తలనొప్పిగా మారాడు. ఎందుకంటే బుమ్రా లార్డ్స్ టెస్టులో ఆడడం ఖాయం.. మరి బుమ్రా వస్తే తుది జట్టులో నుంచి ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు సవాల్ గా మారింది.