Ajit Agarkar: భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్..?

అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్ (Ajit Agarkar), షేన్ వాట్సన్ జట్టును విడిచిపెట్టినట్లు ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 08:30 AM IST

Ajit Agarkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్‌లో జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచిన దాదాపు నెల తర్వాత అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్ (Ajit Agarkar), షేన్ వాట్సన్ జట్టును విడిచిపెట్టినట్లు ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చాలా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు ఈ పేలవమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీ తమ జట్టు నుండి 2 అసిస్టెంట్ కోచ్‌ల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇందులో ఒకరు భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ కాగా, మరో పేరు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్.

ఢిల్లీ క్యాపిటల్స్ పేలవమైన ప్రదర్శన తర్వాత ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ను జట్టు నుండి తొలగించే అవకాశం ఉందని చర్చలు జరిగాయి. అయితే, తదుపరి సీజన్‌లో కూడా పాంటింగ్ తన బాధ్యతను నిర్వర్తించేలా కనిపిస్తాడని ఫ్రాంచైజీ యజమాని ట్వీట్ చేయడం ద్వారా స్పష్టం అయింది. ఫ్రాంచైజీ వైపు నుండి అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్ విడిపోతున్నట్లు జట్టు ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. మీ సహకారానికి ధన్యవాదాలు అజిత్, వాట్సన్. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది.

ఫిబ్రవరి 2022లో అగార్కర్ ఫ్రాంచైజీలో అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు. వాట్సన్ ఒక నెల తర్వాత వచ్చాడు. అతను ఢిల్లీ ఫ్రాంచైజీలో ఉన్న సమయంలో జట్టు 2022, 2023 సీజన్‌లలో ప్లేఆఫ్‌ కు వెళ్లడంలో విఫలమైంది. IPL 2023లో రిషబ్ పంత్ లేకపోవడంతో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ 14 మ్యాచ్‌లలో ఐదు మాత్రమే గెలిచి టోర్నమెంట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. IPL 2022లో ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ నుండి నిష్క్రమించింది. ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో వచ్చే ఏడాది IPL కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు ఢిల్లీ సహ యజమాని పాత్ జిందాల్ జూన్ 14న తెలిపారు.

Also Read: Shikhar Dhawan: ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమిండియాకు కెప్టెన్ గా శిఖర్ ధావన్‌..?

చీఫ్ సెలెక్టర్ రేసులో అజిత్ అగార్కర్ పేరు

అజిత్ అగార్కర్ గురించి మాట్లాడుకుంటే.. భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్ రేసులో అతని పేరు ముందుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుండి విడిపోయిన తర్వాత ఈ వార్తలకి మరింత ఊతమిచ్చింది. చీఫ్ సెలెక్టర్ పోస్ట్ కోసం బీసీసీఐ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి చివరి తేదీ జూన్ 30. ఫిబ్రవరిలో మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా తర్వాత ఐదుగురు సభ్యుల సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో ఖాళీని భర్తీ చేయడానికి భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ రేసులో ఉన్నారని అనేక నివేదికలు సూచించిన సమయంలో అగార్కర్ ఢిల్లీ నుండి నిష్క్రమించడం జరిగింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అజిత్ అగార్కర్ చాలా కాలం పాటు భారత జట్టుకు వన్డే ఫార్మాట్‌లో ప్రధాన ఫాస్ట్ బౌలర్ పాత్రను పోషించాడు. అగార్కర్ వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. అదే సమయంలో టెస్ట్‌లో 58 వికెట్లు తీయగా, T20 ఇంటర్నేషనల్‌లో 3 వికెట్లు తీసుకున్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్నప్పుడు అగార్కర్ కూడా ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అగార్కర్ భారతదేశం తరపున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు.