Kohli Dedicates Century: వారిద్దరికే ఈ సెంచరీ అంకితం..కోహ్లీ భావోద్వేగం

సెంచరీలంటే ఒకప్పుడు అతనికి మంచినీళ్ళ ప్రాయం... క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరదే.. అందుకే రన్ మెషీన్ గా పిలుస్తారు.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 11:35 PM IST

సెంచరీలంటే ఒకప్పుడు అతనికి మంచినీళ్ళ ప్రాయం… క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరదే.. అందుకే రన్ మెషీన్ గా పిలుస్తారు. దానికి తగ్గట్టుగానే ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మీద రికార్డులు… సెంచరీల మీద సెంచరీలు చేశాడు. అయితే ఇదంతా మూడేళ్ళ క్రితం మాట.. ఆ తర్వాత ఫామ్ పోయింది.. కెప్టెన్సీ సైతం చేజారింది.. ఇక రిటైర్మెంట్ మాత్రమే మిగిలిందన్న వ్యాఖ్యలూ వినిపించాయి.

వయసు, ఫిట్ నెస్ ఇంకా ఉన్నా పరుగులు మాత్రం చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఈ విమర్శలను తట్టుకుంటూనే ఆటను కొనసాగించిన కోహ్లీ ఇప్పుడు ఆసియాకప్ వేదికగా పూర్తి ఫామ్ లోకి వచ్చాడు. ఆప్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో సెంచరీతో రెచ్చిపోయాడు. సెంచరీ తర్వాత రిలాక్స్ గా సెలబ్రేట్ చేసుకున్న విరాట్ ఇంటర్యూ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు. గతంలో ఎన్నో రికార్డులు నెలకొల్పినా ఇంత సంతోషంగా కోహ్లీని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల మధ్య ఫామ్ లోకి రావడంతో ఆ ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ భావోద్వేగంగా మాట్లాడాడు.
తనకు చాలా ఆనందంగా, గొప్పగా ఉందనీ, గత రెండున్నరేళ్ల కాలం ఎంతో నేర్పిందన్నాడు. చాలా విషయంలో వివిధ దృక్కోణాల్లో చూశానన్నాడు. అయితే ఇవాల్టి మ్యాచ్ లో సెంచరీ తర్వాత కొంచెం షాక్ గురయ్యానని చెప్పాడు.. ఎందుకంటే ఈ ఫార్మాట్లో సెంచరీ చేస్తానని ఊహించలేదన్నాడు.

ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్లే జరిగిందని వ్యాఖ్యానించాడు. ఈ సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కుమార్తే వామికాకు అంకితమిస్తున్నట్లు విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. తాను జట్టులోకి తిరిగి వచ్చినప్పుడు చాలా ఓపెన్‌గా, మద్దతుగా ఉన్నారన్నాడు.తాను ఇక్కడ ఉన్నానంటే.. ఇన్నాళ్లు తన పక్కనే నిలబడే వ్యక్తి చేసిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటాననీ చెప్పాడు. ఈ శతకాన్ని అనుష్కకు, తన కుమార్తె వామికాకు అంకితమిస్తున్నాననీ ఎమోషనల్ గా చెప్పాడు. జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత మునుపటి ఫామ్ అందుకునేందుకు నెట్స్ లోనే ఎక్కువ సమయాన్ని గడిపానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే బయటి వ్యక్తులు చేసే విమర్శలను తాను పట్టించుకోనని, అవి తనపై ఎలాంటి ప్రభావం చూపవని కోహ్లీ స్పష్టం చేశాడు.