Site icon HashtagU Telugu

Lamichanne : పోలీసుల అదుపులో నేపాల్ క్రికెటర్

Lamichanne

Lamichanne

మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచనేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్‌ దీవుల నుంచి ఖాట్మాండులోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండవగానే పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు.నేపాల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటున్న ఫొటోను ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది. రేప్‌ ఆరోపణల్లో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు సందీప్‌ లామిచానె ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ చేశాడు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై తాను చట్టపరంగా పోరాడనున్నట్లు చెప్పాడు. తాను ఖాట్మాండులో ల్యాండవుతున్నట్లు ముందుగానే పోలీసులకు చెప్పానని, ఈ కేసులో పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పినట్లు ఆ పోస్ట్‌లో సందీప్‌ వెల్లడించాడు. తనను రేప్ చేసాడని ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో గత నెలలో సందీప్‌ లమిచ్చానేపై నేపాల్‌ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే నేపాల్‌ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు వేటు వేసి జట్టులో నుంచి కూడా తొలగించింది. అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పుడు సందీప్‌ లమిచ్చానే కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతున్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో జమైకా తలైవాస్‌ కూడా సందీప్ ను జట్టు నుంచి తొలగించింది. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్‌ పోలీసులు సందీప్‌ అరెస్ట్‌ విషయంలో ఇంటర్‌పోల్‌ సాయం కోరారు. నేపాల్‌ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సందీప్‌ 30 వన్డేల్లో 69 వికెట్లు, 44 టీ ట్వంటీల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సందీప్‌ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు.