Capetown: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరం.. ఆందోళన కలిగిస్తున్న కేప్ టౌన్ రికార్డులు!

టెస్టుల్లో భారత్ కు అందని ద్రాక్షగా ఊరిస్తున్న సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ విజయాన్ని ఈ సారి కోహ్లీసేన సాధిస్తుందని చాలా మంది అంచనా వేశారు. గత రెండేళ్ళుగా భారత్ టెస్టుల్లో నిలకడగా రాణిస్తుండడం,

  • Written By:
  • Updated On - January 7, 2022 / 05:33 PM IST

టెస్టుల్లో భారత్ కు అందని ద్రాక్షగా ఊరిస్తున్న సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ విజయాన్ని ఈ సారి కోహ్లీసేన సాధిస్తుందని చాలా మంది అంచనా వేశారు. గత రెండేళ్ళుగా భారత్ టెస్టుల్లో నిలకడగా రాణిస్తుండడం, సౌతాఫ్రికా జట్టు గతంతో పోలిస్తే కాస్త బలహీనంగా ఉండడం వంటి కారణాలతో సిరీస్ గెలుస్తుందని విశ్లేషించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది. సఫారీ టీమ్ ను చిత్తు చేసి సిరీస్ లో ఆధిక్యాన్ని సాధించి ఏడాదికి ఘనంగా ముగింపు పలికింది. అయితే కొత్త ఏడాదిలో అనూహ్యంగా పుంజుకున్న సౌతాఫ్రికా జోహెనస్ బర్గ్ లో భారత్ ను ఓడించి సిరీస్ ను సమం చేసింది. దీంతో కేప్ టౌన్ వేదికగా జరగబోయే మూడో టెస్ట్ ఇప్పుడు సిరీస్ ఫలితాన్ని తేల్చబోతోంది. భారత్ కు ఇక్కడ గత రికార్డులు అనుకూలంగా లేవు. ఈ స్టేడియంలో టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు.

సౌతాఫ్రికాతో తలపడిన ఐదు మ్యాచ్ లలో మూడు సార్లు ఓడిన భారత్, రెండుసార్లు డ్రాగా ముగించింది. చివరిసారిగా 2018లో ఇక్కడ ఆడినప్పుడు 72 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. అంతకుముందు 2011 పర్యటనలో కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ ను డ్రా చేసుకుంది. దీంతో కేప్ టౌన్ లో తొలి విజయం నమోదు చేయాలని మెన్ ఇన్ బ్లూ ఎదురుచూస్తోంది. అయితే గత రికార్డుల పరంగా అదంత సులభం కాకున్నా అసాధ్యం మాత్రం కాదన్నది విశ్లేషకుల అంచనా. ఈ వేదికలో సఫారీ పేసర్ కగిసో రబాడకు అద్భుతమైన రికార్డుంది. ఇక్కడ 6 మ్యాచ్ లలో 35 వికెట్లు పడగొట్టిన రబడాను ఎదుర్కోవడం మూడో టెస్టులో భారత బ్యాటర్లకు సవాలే. అలాగే బ్యాటింగ్ లో ప్రస్తుత సఫారీ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ కు కూడా కేప్ టౌన్ బాగా కలిసొచ్చిన వేదిక. ఈ స్టేడియంలో ఎల్గర్ 10 టెస్టుల్లో 708 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జోహనెస్ బర్గ్ టెస్టులో 96 పరుగులు చేసి జట్టును గెలిచిన ఎల్గర్ ను కేప్ టౌన్ లో అడ్డుకోకుంటే సిరీస్ విజయం భారత్ కష్టమేనని చెప్పొచ్చు.

ఇక గబ్బా, ఓవల్ , సెంచూరియన్ లో ఎప్పుడూ గెలవని భారత్ గత ఏడాది కాలంలో ఆయా వేదికలపై అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. అదే ప్రదర్శనను కేప్ టౌన్ లోనూ కంటిన్యూ చేస్తే చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఇంతకంటే మంచి టైమ్ ఉండదనేది చాలా మంది అంచనా. రెండో టెస్టులో అంతగా ప్రభావం చూపలేకపోయిన బౌలర్లు గాడిన పడితే సఫారీలను కట్టడి చేయొచ్చు. అలాగే ఫామ్ లో లేని పుజారా, రహానే మళ్ళీ గాడిన పడడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. మొత్తం మీద సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా కేప్ టౌన్ లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో వేచి చూడాలి.