Afridi on IPL: ఐపీఎల్ పై అఫ్రిది అక్కసు

ప్రపంచంలోనే క్రికెట్‌ దశ, దిశను ఐపీఎల్ ఎంతగానో మార్చింది. ఈ లీగ్‌ను చూసి చాలా దేశాల్లో లీగ్‌లు పుట్టుకొచ్చినా.. అవేవీ ఐపీఎల్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 09:30 PM IST

ప్రపంచంలోనే క్రికెట్‌ దశ, దిశను ఐపీఎల్ ఎంతగానో మార్చింది. ఈ లీగ్‌ను చూసి చాలా దేశాల్లో లీగ్‌లు పుట్టుకొచ్చినా.. అవేవీ ఐపీఎల్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ మధ్యే ఐపీఎల్‌ మీడియా హక్కులు కనీవినీ ఎరగని రీతిలో 48,390 కోట్లకు అమ్ముడయ్యాయి. బీసీసీఐతోపాటు క్రికెటర్లు, రాష్ట్రాల అసోసియేషన్లపై కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్‌ను మరింత విస్తృతం చేయాలని బోర్డు ఆలోచిస్తోంది.ఏడాది పది టీమ్స్‌ కావడంతో 74 మ్యాచ్‌లు జరగగా.. వీటిని భవిష్యత్తులో మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. దీని కోసం పలు దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరపనుంది.
దీనిపై తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. ఐపీఎల్‌ విండో పెరిగితే.. దానికి ఐసీసీతోపాటు మిగతా బోర్డులు కూడా తమ ప్లేయర్స్‌కు అనుమతి ఇస్తే.. అది పాకిస్థాన్‌ క్రికెట్‌పై ప్రభావం చూపుతుందనీ అఫ్రిది వ్యాఖ్యానించాడు. క్రికెట్ ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందని, దీనికి కారణం.. అతి పెద్ద క్రికెట్ మార్కెట్‌గా ఆవిర్భవించడమేనని చెప్పాడు.

ఐపీఎల్ సీజన్‌ కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయ టోర్నమెంట్లను కూడా వాయిదా వేసుకోవడమో.. రీషెడ్యూల్ చేసుకోవడమో జరుగుతోందని, క్రికెట్‌పై భారత్ సాధించిన ఆధిపత్యానికి అది నిదర్శనమని వ్యాఖ్యానించాడు.భారత్ ఏం చెబితే అదే.. జరుగుతుందన్నాడు. భారత్ చెప్పిన విషయాన్ని క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయ పడ్డాడు.
ఐపీఎల్‌లాగే పాక్‌లోనూ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ జరుగుతోంది. అయితే ఈ మెగా లీగ్‌తో పోలిస్తే.. పీఎస్‌ఎల్‌ పదో వంతు కూడా లేదు. అక్కడ ప్లేయర్స్‌కు లభించే మొత్తం కూడా చాలా చాలా తక్కువ. అదే సమయంలో భారత్ – పాక్ మధ్య సరయిన సంభందాలు లేకపోవడంతో ఈ దేశ క్రికెటర్లను బీసీసీఐ ఐపీఎల్ లో అనుమతించడం లేదు. దీంతో ప్రతీసారీ ఐపీఎల్ పై పాక్ ఆటగాళ్ళు అక్కసు వెళ్లగక్కుతుంటారు. తాజాగా ఐపీఎల్ ను మరింతగా విస్తరించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో అఫ్రిది విమర్శలు గుప్పించాడు. క్రికెట్ ప్రపంచానికి అది మంచిది కాదంటూ అక్కసు వెళ్లగక్కాడు.