3rd Gold For India:ఎత్తారంటే పతకం రావాల్సిందే

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకూ 3 స్వర్ణాలతో సహా ఆరు పతకాలు సాధించారు. అంచనాలకు మించి కొందరు రాణిస్తే... మరికొందరు తమపై ఉన్న అంచనాలను అందుకున్నారు.

  • Written By:
  • Updated On - August 1, 2022 / 03:06 PM IST

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకూ 3 స్వర్ణాలతో సహా ఆరు పతకాలు సాధించారు. అంచనాలకు మించి కొందరు రాణిస్తే… మరికొందరు తమపై ఉన్న అంచనాలను అందుకున్నారు. భారత్‌కు ఇప్పటి వరకూ సాధించిన పతకాలన్నీ వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చినవే. అందుకే మనోళ్ళు ఎత్తారంటే మెడల్ రావాల్సిందేనంటున్నారు అభిమానులు.

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ పతకాల బోణీ చేసింది వెయిట్‌లిఫ్టర్లే. తర్వాత వరుసగా రెండురోజులూ వారి హవానే కొనసాగింది. రెండోరోజు 4 పతకాలు సాధించగా… మూడోరోజు పోటీల్లో రెండు స్వర్ణాలు గెలిచారు. 73 కేజీల విభాగంలో అచింత షెవులి గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. ఫైన‌ల్‌లో 313 కేజీల బ‌రువు ఎత్తిన అచింత అగ్రస్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 143 కిలోలు,క్లీన్ అండ్ జెర్క్‌లో170 కిలోల బ‌రువు ఎత్తిన అచింత స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. గతేడాది జరిగిన జూనియర్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన అచింత.. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో 2019, 2021లో చాంపియన్‌గా నిలిచాడు.తన కెరీర్ బెస్ట్ రికార్డును అధిగ‌మించ‌లేక‌పోవ‌డం కొంత నిరాశ‌కు గురిచేసినా గోల్డ్ మెడ‌ల్ రావ‌డం మాత్రం సంతోషాన్ని క‌లిగించింద‌ని అచింత వ్యాఖ్యానించాడు.

మరోవైపు కామన్వెల్త్ గేమ్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో గోల్డ్ గెలిచిన అచింత షూలికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కంగ్రాట్స్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనుకున్నది సాధించావుగా.. ఇప్పుడు వెళ్లి హ్యాపీగా సినిమా చూసుకో.. అంటూ ట్వీట్ చేశారు. కామన్వెల్త్ క్రీడలకు ముందు వర్చువల్‌గా ఆటగాళ్లతో మాట్లాడారు మోదీ. అప్పుడు అచింతతో జరిగిన సంభాషణను తాజాగా గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉంటే 22వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతాకలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో వచ్చినవే. మీరాబాయ్‌ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం గెలవగా.. 55 కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ సార్గర్‌ రజతం సాధించాడు. అలాగే మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలిస్తే.., పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ్‌ పూజారి కాంస్యం సాధించాడు. తాజాగా జెరెమీ లాల్‌రి 67 కేజీల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.