Site icon HashtagU Telugu

India Wins ODI series: హర్థిక్ ఆల్ రౌండ్ షో…పంత్ సూపర్ సెంచరీ వన్డే సీరీస్ భారత్ కైవసం

Pant

Pant

క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన ప్లేయర్ ఒకరైతే…తన ఫిట్ నెస్ పై ఉన్న డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఆల్ రౌండర్ గా చెలరేగిన ఆటగాడు మరొకరు…ఫలితం ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వన్డే సీరీస్ విజయం భారత్ సొంతమైంది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది ఒకరు రిషబ్ పంత్ , మరొకరు హార్థిక్ పాండ్య…ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సీరీస్ కైవసం చేసుకుంది.

మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు రెండో ఓవర్లోనే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే కీల‌క ఆట‌గాళ్లు బెయిర్‌స్టో,జో రూట్ వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టాడు. తర్వాత జేస‌న్ రాయ్‌తో క‌లిసి కెప్టెన్ బ‌ట్ల‌ర్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ యాభై ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. అయితే హార్దిక్ పాండ్య ఎంట్రీతో పరిస్థితి మారిపోయింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్య వరుస వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను కట్టడి చేశాడు.
తొలి నాలుగు ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన హార్దిక్ రెండు వికెట్లు తీశాడు. జోస్ బ‌ట్ల‌ర్,మెయిన్ అలీ క‌లిసి ఇంగ్లాండ్ స్కోరును 150కి చేరువ చేశారు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నప్పటికి వచ్చిన ప్రతీ బ్యాటర్‌ తలా ఇన్ని పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 259 రన్స్ సాధించింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జేసన్‌ రాయ్‌ 41, మొయిన్‌ అలీ 34, ఓవర్టన్‌ 32 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా.. చహల్‌ 3, సిరాజ్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీశాడు.

చేజింగ్ లో భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. రెండో వన్డే లో టీమిండియాను దెబ్బ తీసిన టాప్లీ మరోసారి రోహిత్, ధావన్ , కోహ్లీ లని ఔట్ చేసి ఒత్తిడి పెంచాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా నిరాశ పరిచాడు. ఈ దశలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ , ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పార్టనర్ షిప్ తో ఇన్నింగ్స్ ను గాడిన పెట్టారు. నిలకడగా ఆడుతూ రన్ రేట్ పడిపోకుండా చూసారు. పాండ్యా 43 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించగా.. పంత్‌ 71 బంతుల్లో అర్థశతకం సాధించాడు. పాండ్య , పంత్ అయిదో వికెట్ కు 133 రన్స్ జోడించగా…పాండ్య 71 రన్స్ కు ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్ , జడేజా భారత్ విజయాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో పంత్ 106 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతనికి వన్డేల్లో ఇదే తొలి శతకం. కాగా సెంచరీ తర్వాత విల్లీ వేసిన 42వ ఓవర్లో పంత్ వరుసగా అయిదు ఫోర్లు కొట్టడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. దీంతో భారత్ 42.1 ఓవర్లలోనే టార్గెట్ చేదించింది. పంత్ 16 ఫోర్లు , 2 సిక్సర్లతో 125 , జడేజా 7 రన్స్ తో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. టెస్ట్ సీరీస్ డ్రాగా ముగిస్తే…టీ ట్వంటీ సీరీస్, వన్డే సిరీస్ లను భారత్ గెలుచుకుంది.