Site icon HashtagU Telugu

Abhishek Sharma: అభిషేక్ శర్మ నికర విలువ, గ్యారేజిలో లగ్జరీ కార్లు

Abhishek Sharma

Abhishek Sharma

ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. ఆరంభ మ్యాచ్ లో జట్టును విజయతీరాలకు చేర్చిన అభిషేక్ చివరి మ్యాచ్ లో భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అభిషేక్ ఎదుర్కొన్న ప్రతి బంతికి వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ ఊచకోతకు డగౌట్ లో కూర్చున్న గంభీర్ తో సహా ఇతర క్రికెటర్లు చప్పట్లతో మోత మోగించారు. కేవలం 54 బంతుల్లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

క్రికెట్ కారిడార్లో అభిషేక్ శర్మ పేరు మారుమ్రోగుతుంది. 24 సంవత్సరాల వయస్సులో తాను దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట నమోదు కావడంతో టి20లో అతని స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దీంతో అతన్ని టీమిండియా భవిష్యత్తు స్టార్ గా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే అతని నెట్ వర్త్ పై వివరాలు సేకరిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ 4 సెప్టెంబర్ 2000లో జన్మించాడు. వయస్సు ఈ రోజుకి 24 సంవత్సరాల 152 రోజులు. జన్మస్థలం అమృత్సర్. ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు.

2015-16లో విజయ్ మర్చంట్ దేశవాళీ అండర్-16 టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ మొదట అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అక్కడ అతను ఏడు మ్యాచ్‌ల్లో 1200 పరుగులు చేశాడు. ఆ తర్వాతి సీజన్‌లో అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 2018లో భారత అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో అతను కూడా ఒక సభ్యుడు. క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 50 పరుగులు చేసి 11 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. దీని తరువాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతన్ని 2018 ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో 19 బంతుల్లో 46 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత కొన్ని సీజన్లలో తన జోరును కోల్పోయాడు. 2022 సంవత్సరంలో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున నాల్గవ సీజన్ ఆడి 426 పరుగులు చేశాడు.

అభిషేక్ శర్మ నికర విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 12 కోట్లు. క్రికెట్ కాకుండా అతను బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి డబ్బు సంపాదిస్తాడు. ఐపీఎల్ లో అతని జీతం రూ. 14 కోట్లు. టి20లో ఒక్కో మ్యాచ్ కి 3 లక్షలు తీసుకుంటున్నాడు. కాగా అభిషేక్ శర్మ తన కుటుంబంతో కలిసి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని ఒక సంపన్న ప్రాంతంలో నివసిస్తున్నాడు. అభిషేక్ శర్మకు కూడా కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో 1 BMW 3 సిరీస్‌తో సహా అనేక కార్లు ఉన్నాయి.