Abhishek Sharma creates history : ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)అదరగొడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు ప్రత్యర్థి బౌలింగ్ ను చీల్చి చెండాడుతున్నాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
215 పరుగుల లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ తొలి బంతికే డకౌట్ అయినప్పటికి అభిషేక్ సన్‌రైజర్స్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. 28 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో ప్లేఆఫ్ల్స్‌లో అడుగుపెట్టింది.
చరిత్ర సృష్టించాడు..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ 6 సిక్సర్లు బాదాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత సీజన్‌లో అభిషేక్ 41 సిక్సర్లు బాదాడు. కాగా.. ఇంతకముందు ఈ రికార్డు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 సీజన్‌లో కోహ్లి 38 సిక్సులు కొట్టాడు. ఈ సీజన్‌లో అభిషేక్ 13 ఇన్నింగ్స్‌ల్లో 38.91 సగటుతో 209.41 స్ట్రైక్‌రేటుతో 467 పరుగులు చేశాడు.
ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
అభిషేక్ శర్మ (2024)- 41
విరాట్ కోహ్లి (2016) – 38
విరాట్ కోహ్లి(2024) – 37
రిషబ్ పంత్ (2018) – 37
శివమ్ దూబె (2023) – 35
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2012 ఐపీఎల్ సీజన్‌లో గేల్ 59 సిక్సులు కొట్టాడు. అంతేకాదండోయ్.. 2013లో 51, 2011లో 44 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో రసెల్ 52 సిక్సర్లు కొట్టాడు.