Tilak Varma: తిలక్ వర్మకు అకస్మాత్తుగా ఎదురైన గాయం టీమ్ ఇండియాలో ఆందోళన కలిగిస్తోంది. 2026 టీ-20 వరల్డ్ కప్ సమయానికి తిలక్ ఫిట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జనవరి 7న తిలక్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ఈ భారత బ్యాటర్ తక్షణమే సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. తిలక్ పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయంపై బీసీసీఐ (BCCI) నుండి ఇంకా ఎటువంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. అయితే ఒకవేళ తిలక్ టీ-20 వరల్డ్ కప్‌కు దూరమైతే, అతని స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఆకాష్ చోప్రా సూచించారు.
తిలక్ స్థానంలో ఎవరు? ఆకాష్ చోప్రా విశ్లేషణ
ఆకాష్ చోప్రా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోలో తిలక్ వర్మకు సరైన ప్రత్యామ్నాయంగా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రతిపాదించారు. తిలక్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కాబట్టి అతని స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌లను ఎంపిక చేయడం సరికాదని ఆకాష్ అభిప్రాయపడ్డారు. టీ-20 ఫార్మాట్‌లో అయ్యర్ ప్రదర్శన గత కొంతకాలంగా అద్భుతంగా ఉందని, అందుకే తిలక్ స్థానంలో అయ్యర్‌కే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.
Also Read: నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన
అయ్యర్‌తో పాటు రియాన్ పరాగ్, జితేష్ శర్మ కూడా మంచి ప్రత్యామ్నాయాలు కావచ్చని ఆకాష్ పేర్కొన్నారు. రియాన్ పరాగ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడతారని, అలాగే జితేష్ శర్మ ఫినిషర్‌గా తన సత్తా చాటుతున్నారని ఆయన విశ్లేషించారు.
తిలక్ గాయంపై కోచ్ అప్‌డేట్
మరోవైపు తిలక్ వర్మకు జరిగిన సర్జరీ చాలా చిన్నదని, అతను త్వరగానే కోలుకుంటాడని హైదరాబాద్ టీమ్ కోచ్ తెలిపారు. కోచ్ డి.బి. రవితేజ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. “రాజ్‌కోట్‌లో బుధవారం తిలక్‌కు చిన్న సర్జరీ జరిగింది. ఇది అంత సీరియస్ విషయం ఏమీ కాదు. ప్రమాదం లేదు. మరో మూడు నాలుగు రోజుల్లో తిలక్ మళ్ళీ మైదానంలోకి దిగడానికి సిద్ధమవుతాడు. తిలక్ ప్రస్తుతం టీమ్‌తోనే ఉన్నాడు. మాతో కలిసే హైదరాబాద్ తిరిగి వస్తాడు. నా అంచనా ప్రకారం.. న్యూజిలాండ్‌తో జరిగే టీ-20 సిరీస్ సమయానికి తిలక్ పూర్తిగా కోలుకుంటాడు” అని వివరించారు.
