KKR vs RR : ఈడెన్ లో కోల్ కత్తాకు షాక్.. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా (KKR) బ్యాటర్లు నిరాశ పరిచారు. రాజస్థాన్ (RR) స్పిన్నర్ చాహాల్ ధాటికి చేతులెత్తేశారు.

  • Written By:
  • Updated On - May 11, 2023 / 11:06 PM IST

IPL T20 2023 KKR vs RR : ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ వెనుకబడిన జట్లు పుంజుకుంటున్నాయి. వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ (RR) కీలక మ్యాచ్ లో దుమ్ము రేపింది. బౌలింగ్ లో చాహల్ , బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ అదరగొట్టిన వేళ కోల్ కత్తా (KKR) పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా (KKR) బ్యాటర్లు నిరాశ పరిచారు. రాజస్థాన్ (RR) స్పిన్నర్ చాహాల్ ధాటికి చేతులెత్తేశారు. గాడిలో పడుతున్నట్లు కనిపించిన ప్రతిసారీ తన సూపర్ బౌలింగ్‌తో దెబ్బ తీశాడు. ఓపెనర్లు జేసన్ రాయ్ 10, రహ్మనుల్లా గుర్బాజ్ 18 ఇద్దర్నీ ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు.ఆ తర్వాత చాహల్ స్పిన్ మ్యాజిక్ మొదలయింది. స్లో పిచ్ పై కోల్ కత్తా (KKR) బ్యాటింగ్ ను దెబ్బ తీశాడు. జోరుమీదున్న కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాను హాఫ్ సెంచరీ చేసిన వెంకటేశ్ అయ్యర్ ను కూడా చాహల్ ఔట్ చేశాడు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. చాహల్ నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

150 పరుగుల టార్గెట్ ను బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ ముందు చాలా చిన్నదయిపోయింది. నితీశ్ రాణా వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దీంతో తొలి ఓవర్లో 26 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా జైస్వాల్ చెలరేగిపోవడంతో మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. పవర్ ప్లే లో రాజస్థాన్ రాయల్స్ 78 పరుగులు చేసింది. జైస్వాల్ కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఆ తర్వాత కూడా కెప్టెన్ సంజూ శాంసన్ తో కలిసి మరింత ధాటిగా ఆడాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 13.1 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. జైస్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు , 5 సిక్సర్లతో 98 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. శాంసన్ 29 బంతుల్లో 48 రన్స్ చేశాడు. కోల్ కత్తా బౌలర్లు ఏ ఒక్కరూ ప్రభావం చూపలేక పోయారు. ఈ విజయంతో రన్ రేట్ గణనీయంగా మెరుగుపరుచుకున్న రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

Also Read:  IPL 2023: సంజూని ధోనితో పోల్చిన గ్రేమ్ స్వాన్