కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధిస్తే… తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మరో మెడల్ వచ్చి చేరింది. పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో భారత్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో లాంగ్ జంప్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం. లాంగ్ జంప్ ఫైనల్లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.
కాగా బహమాస్‌కు చెందిన లకాన్ నైర్న్ కూడా 8.08 మీటర్లే దూకి స్వర్ణం గెలిచాడు.అయితే లకాన్ రెండో ఉత్తమ ప్రదర్శన 7.98 మీటర్లు.. శ్రీశంకర్ 7.84 మీటర్లు కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్ 8.05 మీటర్లు దూకి కాంస్యం గెలిచాడు.
కేరళకు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ 2018 కామన్‌వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు. అపెండిస్ సమస్యతో కామన్‌వెల్త్‌కు దూరమైన మురళీ శ్రీ శంకర్ ఇకపై లాంగ్ జంప్ చేయకపోవడం కష్టమేనని అంతా భావించారు. అయితే అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా లాంగ్‌జంప్‌లో తనను తాను మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసి శెభాష్ అనిపించుకున్నాడు.