Site icon HashtagU Telugu

Ind Vs Eng 5th Test: సీరీస్ విజయం అందేనా ?

Eng Vs India

Eng Vs India

ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయమే లక్ష్యంగా భారత్ చివరి టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమయింది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేసి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరీస్ టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉండగా…చివరి మ్యాచ్ ను డ్రా చేసుకున్నా చారిత్రక సీరీస్ విజయం అందుకుంటుంది. గత పర్యటనతో పోలిస్తే రెండు జట్లూ కూడా కొత్త కోచ్‌లు, కొత్త కెప్టెన్‌ల సారథ్యంలో బరిలోకి దిగుతున్నాయి.
నాలుగో టెస్టుతో పోలిస్తే ఈ సారి తుది జట్టులో పలు మార్పులు జరిగాయి. రోహిత్, రాహుల్, రహానే జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్, మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్, హనుమ విహారి ఆడనున్నారు. టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా కీలకం కానుండగా…కెప్టెన్సీనుంచి దూరమైన కోహ్లి తన స్థాయి మేరకు సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. ఇక రిషభ్‌ పంత్‌ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్ మెంట్ కోరుకుంటోంది.

బౌలింగ్‌ విభాగంలో ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ కీలకం కానుండగా..ఆల్ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాకు చోటు ఖాయం. ఇక బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మిగిలిన ఒక ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. ఇంగ్లండ్‌లో ఇటీవల పిచ్‌లు బాగా మారిన నేపథ్యంలో నాలుగో పేసర్‌కంటే రెండో స్పిన్నర్‌ ప్రభావం చూపగలడనుకుంటే అశ్విన్‌కు చోటు దక్కుతుంది.
మరోవైపు సీరీస్ సమం చేయడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లీష్ టీమ్ సొంత గడ్డపై తిరుగులేని ఫాంలో ఉంది. ఇటీవలే న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్ స్టో కెరీర్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టెస్టులోనూ టీ ట్వంటీ ఫార్మాట్ లో బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. అలాగే మాజీ కెప్టెన్ జో రూట్ , కెప్టెన్ స్టోక్స్ కూడా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ లో అండర్సన్ రాక ఆ జట్టుకు అతి పెద్ద బలం. అతనితో పాటు స్టువర్ట్ బ్రాడ్ పేస్ భారాన్ని మోయనున్నారు. ఈ మ్యాచ్ గెలుస్తేనే ఇంగ్లాండ్ సీరీస్ సమం చేస్తుంది. ప్రస్తుతం టెస్టుల్లో దూకుడు ఆడుతున్న ఇంగ్లాండ్ జోరును అడ్డుకోవాలంటే భారత్ శ్రమించాల్సిందే. ఇదిలా ఉంటే ఎడ్జ్ బాస్టన్ పిచ్ తొలి రోజు పేసర్లకు అనుకూలిస్తుంది. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. ఇక గత రికార్డులు మాత్రం ఇంగ్లాండ్ కే అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ భారత్ తాను ఆడిన ఆరు మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.

Exit mobile version