Virat Kohli Fan: భారతదేశం- దక్షిణాఫ్రికా మధ్య ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో డిసెంబర్ 3న జరిగిన వన్డే మ్యాచ్ సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకుని మైదానంలోకి ప్రవేశించిన యువకుడిపై కేసు నమోదు చేసి, అతడిని జైలుకు తరలించారు. భారత జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli Fan) వద్దకు చేరుకున్న నిందితుడు చంద్ర ప్రకాష్ బంజారే ఆయన పాదాలను తాకాడు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నయా రాయ్‌పూర్‌లో వన్డే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత నక్టా గ్రామానికి చెందిన యువకుడు చంద్రప్రకాష్ బంజారే ప్రేక్షకుల గ్యాలరీ నుండి అకస్మాత్తుగా భద్రతా వలయాన్ని ఛేదించుకుని మైదానంలోకి దూకేశాడు. ఆ 24 ఏళ్ల యువకుడు నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి ఆయన పాదాలను తాకడం ప్రారంభించాడు. ఈ ఆకస్మిక సంఘటనతో కొద్దిసేపు మైదానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది ఆ యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకుని స్టేడియం నుంచి బయటకు పంపారు.
తరువాత అతడిని మందిర్ హసౌద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారణ అనంతరం నిందితుడిపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 170 కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 4న ఆ యువకుడిని అధికారికంగా అరెస్టు చేసి, చట్టపరమైన ప్రక్రియల ద్వారా జైలుకు తరలించారు.
Also Read: BJP Govt: బీజేపీ అవినీతికి అడ్డాగా మారిందా? మాజీ ఐపీఎస్ అధికారి వరుస ట్వీట్లు!
రాయ్‌పూర్ పోలీసులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో భద్రతా వలయాన్ని ఉల్లంఘించడం అనేది ఒక తీవ్రమైన నేరం. ఇది ఆటగాళ్లు, ప్రేక్షకులకు కూడా భద్రతాపరమైన ప్రమాదాన్ని కలిగించవచ్చని తెలిపారు. విచారణలో తాను విరాట్ కోహ్లీకి అభిమానినని, ఆయన్ని కలవాలనే కోరికతో ఈ చర్య తీసుకున్నానని నిందితుడు ప్రకాష్ బంజారే పోలీసులకు చెప్పాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత తాను ఆపుకోలేకపోయానని, అందుకే గ్యాలరీ నుంచి మైదానం వైపు పరుగెత్తానని తెలిపాడు.
మందిర్ హసౌద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆశిష్ యాదవ్ మాట్లాడుతూ.. భద్రతా ప్రోటోకాల్ కింద ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. భద్రతకు సంబంధించిన విషయాలలో ఇటువంటి చర్యలను ఏ పరిస్థితిలోనూ అంగీకరించలేమని ఆయన అన్నారు. ఈ కేసులో నిందితుడైన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
