Site icon HashtagU Telugu

Under 19 : అండర్ 19 క్రికెటర్లకు షాక్

Under 19

Under 19

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ఇంకా మూడు రోజులే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబూల్ లోకి ప్రవేశించగా… వేలంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. కాగా వేలం ముంగిట అండర్ 19 క్రికెటర్లకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అండర్ 19 వరల్డ్ కప్ లో అదరగొట్టిన పలువురు ఆటగాళ్ళపై ఈ సారి వేలంలో కోట్లాది రూపాయల వర్షం కురుస్తుందని భావించిగా… అసలు వేలంలో పాల్గొనేందుకు వారు అర్హులు కారని తెలుస్తోంది. వేలంలో ఉండేందుకు బీసీసీఐ విధించిన నిబంధనలే దీనికి కారణం. ఐపీఎల్ ఆడాలంటే కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్ A మ్యాచ్ ఆడిన అనుభవం ఉండాల్సిందే. ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోతే, అతను ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు కూడా వీలు లేదు. ఒకవేళ దేశవాళీ క్రికెట్ ఆడకున్నా వేలం జరిగే తేదీ నాటికి ఆటగాడి వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి. దీంతో కరేబియన్ గడ్డపై వరల్డ్ కప్ గెలిచిన జట్టులో 8 మంది యువక్రికెటర్లకు వేలంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

వికెట్ కీపర్ దినేష్ బానా, జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, మానవ్ ప్రకాష్, గర్వ్ సంగ్వాన్ ఉన్నారు. వీరిలో బానా, రషీద్, రవి, సింధు భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ ఆటగాళ్లపై బీసీసీఐ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆటగాళ్ళు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకోవడంతో పాటు అటు ఫ్రాంచైజీలు కూడా వీరంతా వేలంలో పాల్గొనేందుకు అంగీకరించాలి. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ అంతగా ఆడలేదని బోర్డులోని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి రంజీ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడాకారుల రాష్ట్ర జట్టు అవకాశం కల్పించినా.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే వేలానికి అర్హులు కారు. మొత్తం మీద అండర్ 19 ఆటగాళ్ళ ఐపీఎల్ వేలం భవిష్యత్తు బీసీసీఐ చేతిలోనే ఉంది.

Exit mobile version