BWF Championship 2022:64 ఏళ్ల వయసులో కుమారుడితో కలిసి చరిత్ర సృష్టించిన తల్లి

వయసుతో ఆటకు సంబంధం లేదని మరోసారి రుజువైంది.

  • Written By:
  • Updated On - August 24, 2022 / 02:23 PM IST

వయసుతో ఆటకు సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే వయసు మళ్లిన వారు పలు క్రీడలలో రాణిస్తూ ఈ విషయాన్ని చాటిచెప్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కుమారుడితో కలిసి చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ 2022లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా అనే 64 ఏళ్ల మహిళ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. BWF చరిత్రలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్లానా చరిత్ర సృష్టించింది. మరో విశేషం ఏమిటంటే.. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆమె కలిసి ఆడింది ఎవరితోనూ కాదు.. తన కొడుకు మిషా జిల్బర్‌మన్‌‌తోనే.

మంగళవారం మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా- మిషా జిల్బర్‌మన్‌ ద్వయం ఈజిప్ట్‌కు చెందిన దోహా హని-ఆడమ్‌ హాటెమ్‌ ఎల్గమల్‌ జోడిపై 16-21, 21-1, 21-11తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను తల్లీ కుమారులు చేజార్చుకున్నా మిగిలిన రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి సంచలన విజయం సాధించారు. కాగా ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా గతంలోనే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇజ్రాయెల్‌ జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో 17 సార్లు సింగిల్స్‌ విజేతగా.. మరో 21సార్లు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆమె విజయాలు సాధించింది. అటు 64 ఏళ్ల వయసులో విజయం సాధించినందుకు స్వెత్లానాపై బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు. 2009లో ఆమె బీడబ్ల్యూఎఫ్‌లో తొలి మ్యాచ్‌ ఆడిందని… 2022లో సాధించిన ఈ విజయం తమకు గర్వకారణమని బీడబ్ల్యూఎఫ్‌ నిర్వాహకులు ట్వీట్ చేశారు.