Site icon HashtagU Telugu

Ind Vs NZ: చివరి వన్డేకూ వరుణుడి బ్రేక్ న్యూజిలాండ్ దే సిరీస్

Grounnd

Grounnd

న్యూజిలాండ్‌ టూర్‌లో చివరి వన్డే గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. వర్షం కారణంగా మూడో వన్డే రద్దవడంతో సిరీస్‌ను 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. నిజానికి చివరి మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. బ్యాటర్లు నిరాశపరచడంతో 219 పరుగులకే పరిమితమైంది. తర్వాత బౌలర్లు కూడా విఫలమవడంతో కివీస్ విజయం దిశగా సాగింది. 18 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసిన దశలో వరుణుడు అడ్డుపడ్డాడు. వన్డేలో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 20 ఓవర్ల ఆట పూర్తవ్వాలి. 2 ఓవర్ల ముందే వర్షం అడ్డుపడడంతో గెలిచే స్థితిలో ఉన్నప్పటకీ 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనుకున్న కివీస్‌కు నిరాశే మిగిలింది. తొలి వన్డేలో కివీస్ గెలవగా.. రెండో మ్యాచ్ కూడా వర్షంతో రద్దయింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. గిల్ 13. ధావన్ 28 రన్స్ కే ఔటవగా.. వైఫల్యాల బాటలో ఉన్న పంత్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలమవడంతో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. అయితే శ్రేయాస్ అయ్యర్ తన ఫామ్ కొనసాగించాడు. 1 పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న శ్రేయాస్ ఔటైన తర్వాత భారత్ స్కోర్ కనీసం 150 దాటుతుందా అనిపించింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. టెయిలెండర్ల సహాయంతో 97 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. సుందర్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వాషింగ్టన్ సందర్ 64 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్సర్ తో 51 పరుగులు చేశాడు.దీంతో భారత్ 47.3 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఆడం మిల్నే, డారిల్ మిచెల్ చెరో 3 వికెట్లు టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత బౌలింగ్ లోనూ భారత్ తేలిపోయింది. పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కివీస్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. తొలి వికెట్ కు 97 రన్స్ జోడించారు. ఫిన్ అలెన్ 57 పరుగులకు ఔటవగా.. 18 ఓవర్ల దగ్గర మ్యాచ్ వర్షంతో నిలిచిపోయింది. తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

Exit mobile version