T20 WC: 3 మ్యాచ్ లు..2 బెర్తులు క్రికెట్ ఫ్యాన్స్ కు సూపర్ సండే

టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న ఎడిషన్ ఏదైనా ఉందంటే ఇది ప్రస్తుత వరల్డ్ కప్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు.

  • Written By:
  • Updated On - November 7, 2022 / 01:19 AM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న ఎడిషన్ ఏదైనా ఉందంటే ఇది ప్రస్తుత వరల్డ్ కప్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. చివరి మూడు మ్యాచ్ ల వరకూ సెమీఫైనల్ బెర్తుల్లో రెండింటిపై క్లారిటీ లేదంటే టోర్నీ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం జరగనున్న మూడు మ్యాచ్ లతో చివరి రెండు సెమీస్ బెర్తులు ఎవరివో తేలిపోనుంది. ఏ జట్టుకు అవకాశాలున్నాయో ఒకసారి చూస్తే…

ఆదివారం ఉదయం 5.30 గంటలకు నెదర్లాండ్స్ తో సౌతాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. సఫారీ జట్టునే ఫేవరెట్ గా చెబుతున్నా.. షార్ట్ ఫార్మాట్ కావడంతో సంచలనం జరగదని కూడా తీసిపారేయలేం. మరో మ్యాచ్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. దీని వల్ల మూడు జట్ల ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. ఒక వేళ పాకిస్థాన్‌ గెలిస్తే.. అప్పుడు ఆరుపాయింట్లు సాధిస్తుంది. జింబాబ్వే చేతిలో భారత్‌ ఓడిపోతే రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. అయితే భారత్‌ కంటే పాక్‌ నెట్‌రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో దాయాది దేశం సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ పాక్‌పై బంగ్లా భారీ విజయం కాకుండా మామూలుగా గెలిస్తే మాత్రం టీమ్‌ఇండియాకే మెరుగైన ఛాన్స్. ఎందుకంటే బంగ్లా కంటే భారత్‌ నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. వాతావరణం అనుకూలించక మ్యాచ్‌ రద్దు అయితే దక్షిణాఫ్రికా, భారత్‌ సెమీస్‌ చేరుకొని.. బంగ్లా, పాక్‌ ఇంటిముఖం పట్టక తప్పదు.

టీమ్‌ఇండియా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లతో గ్రూప్‌ -2లో అగ్రస్థానం దక్కించుకొంది. జింబాబ్వేపై విజయం సాధిస్తే అగ్రస్థానంతో సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా రద్దు అయినా మనకు ఎలాంటి ఢోకా లేదు. ఒకవేళ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ తమ చివరి మ్యాచుల్లో విజయం సాధించినా ఒక సెమీస్‌ బెర్తు మాత్రం టీమిండియాదే. ఇక ఫైనల్ గా
నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా, జింబాబ్వేపై భారత్‌ విజయాలు నమోదు చేస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌ బెర్తులు ఖాయమైపోతాయి. కివీస్, సఫారీలు మొదటి సెమీఫైనల్‌లోనూ, భారత్, ఇంగ్లాండ్ రెండో సెమీస్ లోనూ తలపడతాయి.