Site icon HashtagU Telugu

India vs Australia: మేలుకోకుంటే కష్టమే.. ఆసీస్‌పై సిరీస్ ఓటమి ఓ గుణపాఠం..

3 Lessons India Can Learn From Australia For The 2023 world cup

3 Lessons India Can Learn From Australia For The 2023 world cup

సొంతగడ్డపై మూడేళ్ళ తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది టీమిండియా.. టెస్ట్ సిరీస్ రాణించిన మన జట్టు వన్డేల్లో ఎందుకు చేతులెత్తేసింది.. ఆసీస్ పేస్ ఎటాక్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిందా.. స్పిన్ ను బాగా ఆడే మన క్రికెటర్లు చెన్నైలో ఎందుకు విఫలమయ్యారు.. అప్పుడే మన ఆటగాళ్ళు ఐపీఎల్ మూడ్ లోకి వెళ్ళిపోయారా.. ప్రస్తుతం ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. వన్డే ప్రపంచకప్ కు జట్టు కూర్పు ఎప్పుడో రెడీ అయిపోయిందంటూ ద్రావిడ్ చెప్పిన రెండు రోజులకే మన జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించలేదు. ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలుస్తుందా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ద్వైపాక్షిక సిరీస్ లలో గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్ కు సంబంధించి భారత్ (India) నిలకడగానే విజయాలు సాధిస్తోంది. ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్ తప్పిస్తే స్వదేశీ, విదేశీగడ్డపైనా మెరుగ్గానే రాణించింది. అయితే సొంతగడ్డపై మాత్రం ఆస్ట్రేలియాకే తలవంచింది. గత నాలుగేళ్లుగా ఈ పరిస్థితే కనిపిస్తోంది. 2018 నుంచి స్వదేశంలో టీమిండియా (Team India) ఆడిన పది వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రెండుసార్లు మాత్రమే సిరీస్‌ను ఓడిపోయింది.. ఓడిన రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలోనే… 019లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఆసీస్‌ ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా ఏడు వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆసీస్ చేతిలోనే భారత్ (India) కు చుక్కెదురైంది.

వన్డే సిరీస్ పరాభవానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే మూడు మ్యాచ్ లలోనూ అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లు ఎవ్వరూ ఆడలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్, కోహ్లీ, కెఎల్ రాహుల్, పాండ్యా విఫలమయ్యారు. సూర్యకుమార్ మూడు మ్యాచ్ లలోనూ డకౌటవగా.. రాహుల్ తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ చివరి వన్డేలో హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రోహిత్, గిల్ కూడా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. సొంతగడ్డపైనే మన బ్యాటింగ్ వైఫల్యం ఇలా ఉంటే సిరీస్ విజయాలు ఆశించడం అత్యాశే అవుతుంది. మరోవైపు భారత క్రికెటర్లు 10 రోజుల ముందే ఐపీఎల్ మూడ్ లోకి వెళ్లిపోయారన్న విమర్శలూ వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల గ్యాప్ ఉన్నప్పటకీ… వన్డే ఫార్మాట్ కు తగినట్టు ఎవరూ ఆడలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఐపీఎల్ కు ముందు ఎప్పుడూ ఇలాంటి ప్రదర్శన కామనే అంటున్నారు. అయితే ఈ ఏడాది సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో టీమిండియాపై అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకోవాలంటే మాత్రం బ్యాటర్లు నిలకడగా రాణించాల్సిందే. అటు బిజీ షెడ్యూల్ ను కూడా కొందరు కారణంగా చెబుతున్నారు. అదే నిజమైతే ఐపీఎల్ సమయంలో కీలక ఆటగాళ్ళ వర్క్ లోడ్ ను బీసీసీఐ , హెడ్ కోచ్ ద్రావిడ్ మానిటర్ చేయాలి. వీలును బట్టి కొన్ని మ్యాచ్ లకు ప్రధాన ఆటగాళ్ళను బెంచ్ కే పరిమితం చేయాలి. లేకుంటే వన్డే వరల్డ్ కప్ లో ఘోరపరాభవం తప్పదు.

Also Read:  Job in USA: టూరిస్ట్ వీసాతో వెళ్లి యూఎస్ లో ఉద్యోగం వెతుక్కోవచ్చు!