ICC Trophies: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన గత రాత్రి తుది శ్వాస విడిచారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004-2014 వరకు 10 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా ఉన్నారు. అతని హయాంలో భారత్ 3 ఐసీసీ ట్రోఫీలను (ICC Trophies) గెలుచుకుంది. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు మన్మోహన్ సింగ్ స్వయంగా స్టేడియానికి చేరుకున్నాడు. అప్పటి పాక్ ప్రధానితో కలిసి మన్మోహన్ సింగ్ ఆ మ్యాచ్ ని చూడటం అందర్నీ అబ్భురపరిచింది.
2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్ -పాక్ మధ్య మార్చి 30న సెమీస్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం అప్పటి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ భారత్‌కు వచ్చారు. యూసుఫ్ రజా గిలానీ మొహాలీలోని స్టేడియానికి వచ్చి మైదానంలో నడుస్తూ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్ సింగ్ తో కలిసి యూసుఫ్ రజా గిలానీ మ్యాచ్ ని తిలకించారు. కాగా సెమీస్‌లో పాకిస్థాన్‌ను 29 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
Also Read: Former PM Manmohan Singh Dies : మన్మోహన్ మృతిపై చిరంజీవి రియాక్షన్
మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ 3 ఐసీసీ ట్రోఫీలు
మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. 2007లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ తొలి సీజన్‌లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీని తర్వాత ధోని కెప్టెన్సీలో టీం ఇండియా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రీడల్లో మన్మోహన్ సింగ్ సహకారం ఎంతో ఉందంటుంటారు. ఆయన ప్రోత్సాహంతోనే అప్పట్లో టీమిండియా బలమైన జట్టుగా అవతరించిందని మాజీలు చెప్తుంటారు. ఏదేమైనా మన్మోహన్ సాంగ్ లోటును ఎవరూ భర్తీ చేయలేనిది.