Cricket Matches: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చారిత్రక అవకాశం లభించింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ (CWG) నిర్వహణ హక్కులను ఈ నగరం అధికారికంగా దక్కించుకుంది. గ్లాస్గోలో బుధవారం జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో అహ్మదాబాద్ ఆతిథ్య హక్కులను లాంఛనంగా స్వీకరించింది. ఈ ప్రతిష్ఠాత్మక బహుళ-క్రీడా ఈవెంట్ (Cricket Matches) దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారతదేశానికి తిరిగి వస్తోంది.
క్రికెట్ మ్యాచ్‌లకు వడోదర పరిశీలనలో
భారత ఒలింపిక్ సంఘం (IOA) CEO రఘురామ్ అయ్యర్ గురువారం మాట్లాడుతూ.. CWGని ‘కాంపాక్ట్’గా నిర్వహించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అయితే క్రికెట్ వంటి క్రీడా విభాగాలకు ఎక్కువ వేదికలు అవసరమైనందున అహ్మదాబాద్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు నగరం వడోదర సహ-ఆతిథ్యం ఇచ్చేందుకు పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ క్రీడల ముఖ్య కార్యదర్శి అశ్వని కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చాలా వరకు ఈవెంట్‌లు అహ్మదాబాద్, గాంధీనగర్ జంట నగరాల్లో నిర్వహించబడతాయి.
లక్ష మందికి పైగా సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం కీలక క్రికెట్ మ్యాచ్‌లు, ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. వడోదరలో వడోదర అంతర్జాతీయ స్టేడియం, రిలయన్స్ స్టేడియం వంటి ప్రధాన క్రికెట్ వేదికలు అందుబాటులో ఉన్నాయి. 2030 CWGలో T20 ఫార్మాట్‌లో క్రికెట్ ఒక ఈవెంట్‌గా ఉంటుంది. అయితే 2022 బర్మింగ్‌హామ్ CWGలో మహిళల T20 క్రికెట్‌ను మాత్రమే చేర్చారు. 2030లో పురుషుల ఈవెంట్‌ను కూడా చేరుస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!
ఖరారైన, పరిశీలనలో ఉన్న క్రీడలు
కామన్వెల్త్ స్పోర్ట్ ధృవీకరించిన ప్రకారం 2030 క్రీడల్లో 15 నుండి 17 క్రీడలు ఉండనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బౌల్స్, వెయిట్‌లిఫ్టింగ్ (వాటి పారా విభాగాలు), ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్‌బాల్, బాక్సింగ్ ఖరారయ్యాయి. ఆర్చరీ, బ్యాడ్మింటన్, 3×3 బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, క్రికెట్ T20, సైక్లింగ్, హాకీ, జూడో, షూటింగ్, స్క్వాష్, రెజ్లింగ్ వంటి ఆటలు పరిశీలనలో ఉన్నాయి.
దేశీయ క్రీడలకు అవకాశం
భారతదేశం ఆతిథ్య దేశంగా గరిష్టంగా రెండు కొత్త లేదా సాంప్రదాయ క్రీడలను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ రేసులో యోగా, ఖో-ఖో, కబడ్డీ వంటి దేశీయ క్రీడలు ముందున్నాయి. 2026 ఆసియా క్రీడల్లో యోగా ఇప్పటికే మెడల్ స్పోర్ట్‌గా చేర్చబడింది.
